ప్రజా ప్రతినిధులు, అధికారుల కృషి వలన తెలంగాణ ఆర్థిక శక్తిగా అద్భుతంగా పురోగమిస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు.
యాదాద్రి జిల్లా నూతన సమీకృత కార్యాలయ సముదాయ భవనానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టరేటులోని మీటింగ్ హాల్లో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రివర్గ నిర్ణయాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి వలన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక శక్తిగా అద్భుతంగా పురోగమిస్తున్నదని, ఆర్థిక పురోగతిలో ప్రజలు, సామాన్యులు అందరు కూడా భాగస్వాములేనని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం ప్రారంభించుకోవడం పట్ల అందరికీ అభినందనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలలో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయని, ఒకప్పుడు ఎన్.టీ. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లాగా చేస్తామని అన్నారని, చివరికి చేయలేకపోయారని తెలిపారు.
వంద శాతం తెలంగాణ వస్తుందనే నమ్మకంతోనే పని చేయడం జరిగిందని, నూతన జిల్లాల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పది లక్షల జనాభా ఉంటే నూతన జిల్లాగా చేయాలనే ఆలోచన కలిగిందని, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో ప్రజలకు అందుతాయని అన్నారు. భువనగిరి భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్ వరంగల్ కారిడార్ అద్భుతంగా అవుతుందని, అది నా కల అని అన్నారు. జనగామ, హనుమకొండ, భువనగిరి, వరంగల్, మేడ్చల్ జిల్లాల ఏర్పాటుతో బాగా అభివృద్ధి అవుతుందని అన్నారు. మారుమూల ప్రాంతాలలో కూడా భూముల ధరలు పెరిగాయని, తద్వారా సంపద పెరిగిందని అన్నారు. సానుకూల వాతావరణం ఉంటేనే అన్ని వసతులు ఏర్పడతాయని తెలుపుతూ తెలంగాణ అభివృద్ధిలో అధికారుల పాత్ర చాలా ఉందని అన్నారు. ఒకప్పుడు భువనగిరి ప్రాంతంలో 900 ఫీట్లు వరకు ఉన్న నీటి వనరులు ప్రస్తుతం 20 ఫీట్ల లోపే ఉన్నాయని, దీనికి అన్ని శాఖల కృషి అభినందనీయమని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి చేశామని, ప్రతి వాగు మీద చెక్ డ్యామ్ ఏర్పాటు చేశామని, 24 గంటల నాణ్యమైన కరెంటుతో తెలంగాణ వెలుగులు చిమ్ముతున్నదని అన్నారు.
సమైక్య పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా చెరువులు దీనావస్థలో ఉండేవని, నల్లగొండ జిల్లాలో వర్షం వలన వలిగొండ దగ్గర రైలు కొట్టుకుపోవడం జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచాలనే ఉద్దేశంతోనే మిషన్ కాకతీయ ఆలోచన వచ్చిందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రులతో గంటలకొద్దీ సమీక్షలు చేస్తున్నామని, పకడ్బందీగా అమలు జరుపుతున్నామని, అభివృద్ధి బాటలో ఉద్యోగుల తోడ్పాటుకు రైతుల పక్షాన చీఫ్ సెక్రటరీ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. చీఫ్ సెక్రటరీ అద్భుతమైన ప్రణాళికతో ఆరు నెలల కాలంలోనే రాష్ట్రంలో 2601 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం చేయడం జరిగిందని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమంలో మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ప్రతి దశలోనూ కూడా అనేక విధాలుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రైతు బంధు, రైతు బీమా ఉదాహరణ అని, రైతు చనిపోతే ఎనిమిది రోజులలోనే రైతు బీమా ద్వారా ఐదు లక్షలు రైతు కుటుంబానికి అందుతున్నాయని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతర కృషి చేస్తున్నారని, గుణాత్మకమైన మార్పు కోసం పని చేస్తున్నామని తెలిపారు. దళితుల ఆత్మవిశ్వాసం, స్వయంసమృద్ధి కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అద్భుతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. దళితుల ఆర్థిక వికాసం కోసం వైన్స్, బార్లు, ఫర్టిలైజర్స్, ఇతర రంగాలలో దళితులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, అలాగే అన్ని వర్గాల వారికి కల్పించడం జరిగిందని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక విద్యార్థికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయల పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
పేద వర్గాలకు విదేశీ విద్య కోసం 25 లక్షల రూపాయలు అందించే ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ఎకో తెలంగాణలో అద్భుతంగా పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. జోనల్, మల్టీ జోనల్ ద్వారా 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే వస్తాయని, అలాగే ఉద్యోగుల సర్వీసు రూల్స్ సరళీకరణ ఇస్తామని, ప్రమోషన్లలో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని, ఉద్యోగ సంఘాల సమన్వయంతో ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజుననే అని బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మనం చేసే కృషిని కొద్దిగా కొనసాగిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. దేశంలోనే గొర్రెల పెంపకంలో రాజస్థాన్ ను దాటి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని అన్నారు. రాష్ట్రంలో 33 నూతన జిల్లాల కలెక్టరేట్ల నమూనాలకు రూపకల్పన చేసిన భువనగిరి బిడ్డ ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి అని అభినందించారు. రాష్ట్ర సంక్షేమ రంగంలో ఉద్యోగుల కృషికి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్ అనేది ఎవరు ఊహించలేదని, ప్రతి గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్ల ఏర్పాటు ద్వారా పారిశుద్ధ్యం పక్కాగా నిర్వహించడం జరుగుతున్నదని, మనిషి చనిపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దహన సంస్కారాల కోసం ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేశామని, ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఏర్పాటు చేశామని, తెలంగాణ రాష్ట్రం గురించి ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని అన్నారు.
తెలంగాణలో అద్భుతమైన రోడ్లను మన ఇంజనీర్లు ఏర్పాటు చేస్తున్నారని అభినందించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి కొనసాగిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని, ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మనందరి కోరిక అని అన్నారు.
అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి యాదాద్రి పుణ్య క్షేత్రం లో నూతన ప్రెసిడెన్షియల్ సూట్ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు.
కార్యక్రమాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీత రెడ్డి, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, సైదిరెడ్డి, నోముల భగత్, జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.