అమ్మకు నివాళులర్పించిన సీఎం
అల్లం సార్ ఇంట విషాదం
మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జె ఏ సిలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చిన అమ్మల సంఘం అధ్యక్షురాలు, ఉపాధ్యాయురాలు అల్లం పద్మక్క నేటి మధాహ్నం తీవ్ర అస్వస్థతతో నిమ్స్ లో కన్నుమూయడంతో ఒక నిఖార్సైన ఉద్యమనేతను తెలంగాణా కోల్పోయింది. ముఖ్యంగా విద్యార్థుల బాధలను పట్టించుకుని, ఎల్లవేళలా ఆదరణ చూపే కొండత అండ లేకుండా పోయింది.
అల్లం పద్మక్క తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్థాపించి ఉద్యమాన్ని ఉరకలెత్తించి, నమస్తే తెలంగాణ సంపాదకులుగా పనిచేసి, ప్రస్తుతం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కొనసాగుతున్న అల్లం నారాయణ గారి సతీమణిగా అందరికీ చిరపరిచుతులే.
ఉస్మానియా కేంద్రంగా అమ్మల సంఘం
ప్రధానంగా ఉస్మానియాలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన సమాధానం చెప్పి ఎందరో విద్యార్థులకు ఆకలి తీర్చిన అమ్మగా, అమ్మల సంఘం అధ్యక్షురాలు అల్లం పద్మక్క చిరస్మరణీయురాలు. వారి మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు విద్యార్థులు, ఉద్యమకారులు, మేధావులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.
అనారోగ్యాన్ని కూడా లెక్క చేయని ఉద్యమతార
తాను గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తూనే అప్పట్లో ఉద్యమంలో, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన పద్మక్క గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ అకాలమరణం చెందారు.
అల్లం పద్మక్క సోదరుడికి విప్లవోధ్యమంతో మమేకమైన చరిత్ర ఉంది. కరీంనగర్ రాడికల్ విద్యార్థి సంఘం తొలితరం నాయకుల్లో వారి అన్నయ్య కనకయ్య ముఖ్యులు. భర్త నారాయణ గారి సాహచర్యంతో ఆమె మలి తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలంగా ఉండటమే గాక తన నేతృత్వంలో అమ్మల సంఘం ఏర్పాటు చేయడం విశేషం. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు – రవళి భావనలు, కుమారుడు రాహుల్ ఉన్నారు.
దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధికి తోడు కోవిడ్ కూడా ఒక దశలో తనను ఇబ్బంది పెట్టడం, అన్నీ కలిసి ఆమెను మరింత కృంగదీశాయి. వైద్యులు ఎంత శ్రమించినప్పటికీ తాను కోలుకోక పోవడం విచారకరం.
రేపు మధాహ్నం మహాప్రస్థానంలో అంతక్రియలు
అల్లం పద్మక్క పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రేపు ఉదయం అనగా బుధవారం ఉదయం ఎర్రగడ్డ జేక్ కాలనీ లోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ రోడ్ నెంబర్ 1 వద్ద ఉంచుతారు. అప్పటివరకు మృతదేహం నిమ్స్ ఆసుపత్రి లో ఉంటుంది. రేపు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం లో మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి.
సీఎం కేసీఆర్… కేటీఆర్ ల నివాళులు*
.అల్లం నారాయణ సర్ సతీమణిఅల్లం పద్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను సిఎం ఈ సందర్భంగా యాది చేసుకున్నారు. అల్లం నారాయణను ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అల్లం పద్మ గారి మృతికి కేటీఆర్ సంతాపం
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి సతీమణి పద్మ గారి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు….
అల్లం పద్మ గారు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి అని, ఉద్యమ సందర్భంలో ఆమె పోషించిన పాత్రను కేటీఆర్ గుర్తు చేశారు…
అల్లం నారాయణ కుటుంబ సభ్యులకు కు తన సానుభూతి తెలిపిన మంత్రి కేటీఆర్, అల్లం పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు…