ట్రస్మా కేర్ టేకింగ్ రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్ పిలుపు
సెలక్షన్ వద్దు ఎలక్షన్ తో సత్తా చాటుదాం
ఎన్నో అవమానాలు భరిస్తున్నాం: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు
కోట్లకు వారసున్ని రూపాయి తినలేదు: కోశాధికారి రాఘవేందర్ రెడ్డి
మధన్న మీ వెంటే మేమున్నాం యాదాద్రి జిల్లా కరస్పాండెంట్స్
భువనగిరి, రోమింగ్ న్యూస్:ట్రస్మా లో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పారదర్శకంగా ఇంట్లో నుంచే ఈ నెల 29న ఉపయోగించుకునే అద్భుతమైన అవకాశాన్ని ఈసారి కల్పించినట్లు ట్రస్మా కేర్ టేకింగ్ ప్రెసిడెంట్ సాదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్.రమేష్ రావు, కోశాధికారి రాఘవేంద్ర రెడ్డిలు వెల్లడించారు. గురువారం భువనగిరిలో జరిగిన ట్రస్మా ఎన్నికల అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. ట్రస్మాలో సభ్యత్వం పొందిన 5000 పై చిలుకు సభ్యులు తమ ఓటు హక్కును అద్భుతమైన టెక్నాలజీతో ఇంట్లో నుంచి ఓటు హక్కును ఈనెల 29న తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఉపయోగించుకునే అవకాశం కలిగించినట్లు చెప్పారు.
ప్రతి ఒక్కరికి తమ యొక్క రిజిస్టర్ నంబర్ నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించామని చెప్పారు. ఒకరు ఒకేసారి ఓటేసే అవకాశం ఉంటుందని చెప్పారు. గతంలోనే ప్రతి ఒక్క కరస్పాండెంట్ కు సంబంధించిన వారి మొబైల్ నెంబర్ పైన వారికి ఐడి కార్డులు అందజేశామని దానివల్ల ఇలాంటి ఓటు వేసే అవకాశాన్ని కల్పించడం సులభతరమైందని స్పష్టం చేశారు. దీనివల్ల సమయంతో పాటు ఎక్కడున్నా ఓటు వేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటేశామన్న సంతృప్తి ప్రతి ఒక్కరికి కలుగుతుందని చెప్పారు.
సెలక్షన్ వద్దు ఎలక్షన్ ముద్దు
సెలెక్షన్ పద్ధతిని వదిలేసి ఎలక్షన్ పద్ధతిలో పాలకవర్గం ఎన్నికైతే పారదర్శకంగా పవర్ ఫుల్ గా పని చేసే అవగాహన అవకాశం కలుగుతుందని వారు చెప్పారు. ఓటు ఎలా వేయాలన్న విషయంపై సమగ్రంగా తమ వెంట వచ్చిన టెక్నికల్ బృందంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని కరస్పాండెంట్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పది నెలల కాలంలో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. వేలాదిమంది ఉపాధ్యాయులకు తమ ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల ఈ కార్యక్రమం ఒక ఉద్యమం లాగా చేపట్టడం వల్ల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఉపాధ్యాయులను తీర్చిదిద్దే అద్భుతమైన అవకాశం కలిగిందని చెప్పారు. ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాయన్నారు. ప్రావీణ్యాన్ని పెంచుకోవడం వల్ల సమర్థత పెరిగి బోధనా నైపుణ్యాలు అభివృద్ధి చెందినట్లు ఆయన వివరించారు. ఉపాధ్యాయులంతా ఈ భావనతో శిక్షణ ముగించుకుని వెళ్లారని వివరించారు. టెక్నాలజీని అనుసంధానం చేసుకొని బోధన చేయాల్సిన అవసరాన్ని ఈ శిక్షణలో నేర్పించామన్నారు. అదేవిధంగా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి గా పని చేసిన బుర్ర వెంకటేశం, ఇతర విద్యాశాఖ అధికారులతో అనేక దఫాలుగా సమావేశమై బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ సమస్యల పైన వారికి అవగాహన కల్పించామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన విద్యా కమిషన్ సభ్యులను కూడా కలిసి బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను… బడ్జెట్ స్కూల్స్ వల్ల పట్టణాల్లోని బస్తీ, గ్రామీణ ప్రాంత బడ్జెట్ స్కూల్స్ విద్యార్థులు పొందుతున్న అవకాశాలను వివరించామని చెప్పారు. ఇవన్నీ చేయడానికి ఈ కాలాన్ని ఉపయోగించుకున్నామని చెప్పారు. తాము తిరిగి రెండేళ్ల కాలం కోసం అధ్యక్ష, కార్యదర్శులకు, కోశాధికారి పదవులకు పోటీపడుతున్న విషయాన్ని వారు వివరించారు.
*మధన్న మీ వెంటే మేమున్నాం యాదాద్రి జిల్లా కరస్పాండెంట్స్*
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రశ్నలు సభ్యత్వం పొందిన కరస్పాండెంట్లంతా సాధుల మధుసూదన్ టీం తో ఉన్నామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా అధ్యక్షులు ఈ అచ్చయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు, కోశాధికారి జయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టిపర్తి భాస్కర్, బండి రాజుల శంకర్, ఐలేని రాంరెడ్డి తదితరులు మాట్లాడుతూ పది నెలల కాలంలో మధుసూదన్, రమేష్ రావు, రాఘవేంద్ర రెడ్డిలు కరస్పాండెంట్లకు అవసరమైన అనేక కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధికి పాటుపడ్డారని ప్రశంసించారు. అందువల్ల ఈ టీం తోటే ఉండేందుకు వారు ఏకగ్రీవంగా తీర్మానించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి కరస్పాండెంట్ల సమస్యలపై రాజీలేని పోరాటం చేసేందుకు ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోవాలని వారు సందర్భంగా సూచించారు.
ఎన్నో అవమానాలు భరిస్తున్నాం: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రావు
*చీఫ్ అడ్వైజర్ శేఖర్ రావు బృందం సృష్టిస్తున్న సమస్యల వల్ల అనేక అవమానాలను భరిస్తున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.రమేష్ రావు తెలిపారు. అనేక అవమానాలు భరించే పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పారు. బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్మా అకౌంట్ నుంచి నయా పైసా వాడుకోలేదని వారు స్పష్టం చేశారు. తాము ఈ పది నెలల కాలంలో ప్రతిక్షణం బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ప్రగతి కోసం పాటుపడ్డామని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసాం… దేవాదాయ శాఖ మంత్రిని కలిసాం… సమస్యలను వివరించాం… అందువల్లనే ప్రశాంతంగా ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
*కోట్లకు వారసున్ని రూపాయి తినలేదు: కోశాధికారి రాఘవేందర్ రెడ్డి*
తను స్వతహాగా కోట్ల రూపాయల ఆస్తికి వారసుండని అలాంటి నేను ట్రస్మాలో ఉన్న 75 లక్షల రూపాయలలో 35 లక్షలు ఏ విధంగా డ్రా చేసి ఖర్చు చేస్తామని ఆయన సూటిగా ప్రశ్నించారు. మేము చేసినదల్లా ఎక్కువ వడ్డీ వస్తుందని ఇతర బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసి దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఎప్పుడైనా… ఎక్కడైనా… ఓపెన్ చాలెంజ్ కి సిద్ధంగా ఉన్నామని, ఎక్కడైనా నిరూపించేందుకు తను వస్తానని ఆయన సవాల్ విసిరారు. కానీ శేఖర్ రావు యాదగిరి వాడుకున్న 10 లక్షల రూపాయలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బులు వాడుకునేది ఒకరు… నిజాయితీగా డబ్బులను కాపాడిన మమ్మల్ని బద్నాం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా సలహాదారులు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ 29 జరిగే ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరారు. వుడా మాజీ చైర్మన్ సుందర్ మాట్లాడుతూ తాను 30 ఏళ్ల నుంచి విద్యా ప్రపంచంలో ఉన్నానని తాను వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటీలో ఉన్నానని ఓటేసి గెలిపించాలని కోరారు.