దసరాకు అంతా సిద్ధం
శ్రవణా నక్షత్రంతో కలిసి వచ్చిన దసరా… అంతా శుభమేనంటున్న పండితులు
యాదగిరి కొండపై సాయంత్రం 5:30 శమీ పూజ
“విజయదశమి అంటే విజయాలను చేకూర్చే పండుగ. శనివారం విజయదశమిని ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. దసరా పండుగ దశమి తిది శనివారం ఉదయం 10:58 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం ఉదయం 9:08 నిమిషాల వరకు కొనసాగుతుంది. శాస్త్రాల ప్రకారం విజయదశమి లేదా దసరా నాడు శ్రవణా నక్షత్రం ఉండడం చాలా శుభప్రదమైనది. ఈ సంవత్సరంలో శ్రవణా నక్షత్రం అక్టోబర్ 12న ఉదయం 5:25 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 13 తెల్లవారుజామున 4:27 గంటలకు ముగుస్తుంది. విజయదశమి పూజకు మంచి సమయం మధ్యాహ్నం 2:02 నుంచి :2: 48 గంటల వరకు ఉంటుంది. దీని మొత్తం వ్యవధి దాదాపు 46 నిమిషాలు ఉంటుంది”
యాదగిరిగుట్ట, అక్టోబర్ 11 (రోమింగ్ న్యూస్):
విజయదశమి అంటే విజయాలను చేకూర్చే పండుగ. శనివారం విజయదశమిని ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఒకవైపు దేవి నవరాత్రుల కోలాహలం…మరో ఆడపడుచులు ఎంతో ప్రేమగా ఆడుకునే బతుకమ్మ ఆటతో సందడి చేసిన వీధులు పండుగకు సరికొత్తగా ముస్తాబవుతున్నాయి. “దసరా పండుగ దశమి తిది అక్టోబర్ 12, 2024 ఉదయం 10:58 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 13, 2024 ఉదయం 9:08 నిమిషాల వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 12న దసరా జరుపుకొనున్నారు. శాస్త్రాల ప్రకారం విజయదశమి లేదా దసరా నాడు శ్రవణా నక్షత్రం ఉండడం చాలా శుభప్రధమైనది. ఈ సంవత్సరంలో శ్రవణా నక్షత్రం అక్టోబర్ 12న ఉదయం 5:25 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 13 తెల్లవారుజామున 4:27 గంటలకు ముగుస్తుంది. విజయదశమి పూజకు మంచి సమయం విజయదశమి రోజున పూజా సమయం మధ్యాహ్నం 2:02 నుంచి :2: 48 గంటల వరకు ఉంటుంది. దీని మొత్తం వ్యవధి దాదాపు 46 నిమిషాలు ఉంటుంది”
పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. దుర్గాదేవి చల్లని చూపుతో ప్రతి పనిలో విజయం చేకూరుతుందని, సంతోషం సొంతమవుతుందని భక్తుల నమ్మకం. తెలంగాణలో దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహిషాసురుడు దేవేంద్రుడిని ఓడించి దేవలోకానికి అధిపతి అయ్యాడు. ఆ రాక్షసుడు పెట్టే బాధలు భరించలేక దేవతలు త్రిమూర్తులతో మొర పెట్టుకుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నుంచి వెడలిన మహోజ్వలశక్తి శక్తి రూపంగా ఆవిర్వవించింది. ఆ విధంగా సాక్షాత్కరమైన ఆ దివ్య మంగళరూపానికి మహాశివుడు శూలం, విష్ణువు చక్రం, బ్రహ్మ అక్షమాల, కమండలం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, హిమవంతుడు సింహవాహనం ఇచ్చారు. ఇక ఆ మహాశక్తి దేవతలను పీడిస్తున్న మహిషాసురుడిని తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరికి సంహరించింది. మహిషాసురుడిని వధించినందునే మహిషామర్ధిని అయింది. మహిషాసురుడి పీడ విరగడ కావడంతో ప్రజలు కూడా సంతోషంగా పండుగను జరుపుకున్నారు. దుష్టశక్తిపై దైవశక్తి విజయం సాధించిన రోజు కనుక విజయదశమి అయింది.
పరమపావని… ఆనంద ప్రదాయిని..!!
పరమపావని… ఆనంద ప్రదాయిని… తేజస్వరూపిణి… సౌజన్యమూర్తి..జగన్మాత.. మహిషాసురుడిని వధించిన శక్తిమాత దుర్గాదేవి, ఈ విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగ విజయదశమి. దుష్టసంహారిణి.. శిష్ట సంరక్షిణి భక్తులకు కొంగుబంగారమైన జగన్మాతను పూజిస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం సిద్ధిస్తుంది. విశ్వమంతా పరాశక్తి మీద ఆధారపడి ఉంటుందని పురాణ ప్రసక్తి ఉంది. మాత తన కనుసన్నలతోనే లోకాలన్నింటిని పాలిస్తుందని నమ్మకం. దసరాకు ముందు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ తెలంగాణలోనే ఎంతో ప్రజాధరణ పొందినది. ఈ సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రులు భక్తుల పాలిట కొంగు బంగారం… ఒకవైపు గౌరీ మాతగా బతుకమ్మల ద్వారా పూజలందుకుంటారు.
త్రిశక్తిగా అమ్మవారు…!!
మరోవైపు త్రిశక్తిగా అమ్మవారు నవరాత్రుల ద్వారా పూజలందుకుంటారు. నవరాత్రుల్లో అమ్మవారు ప్రసన్నురాలై భక్తులను అనుగ్రహిస్తుంది. అందుకే జగన్మాతకు ప్రజలు నీరాజనాలు పలుకుతారు.
సరస్వతిదేవిగా, శ్రీమహాలక్ష్మిగా, బాలాత్రిపుర సుందరీదేవీగా, గాయత్రీదేవీగా, లలితాత్రిపుర సుందరిగా, మహాంకాళిగా, అన్నపూర్ణగా, కామాక్షిగా, మహిషాసురమర్థిని ఇలా ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో అమ్మవారు పూజలు అందుకుంటారు. రాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు చేరిన సంఘటన, అర్జునుడు ఉత్తర గోగ్రహణ యుద్ధానికి సిద్ధమైన ఘటన, రఘు మహారాజు స్వర్గం మీద యుద్ధానికి సిద్ధమవగా కుభేరుడు కనకవర్షం కురిపించినది, శివాజీ శత్రు సేనలను చీల్చిచెండడానికి సిద్ధమైనది విజయదశమి రోజే. ఈరోజు సాయంకాల సమయాన్ని విజయమంటారు. ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా విజయాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. గ్రామ ప్రజలందరూ మంగళవాయిద్యాలతో గ్రామ పొలిమేరలలో ఈశాన్య దిక్కుగా వెళ్లి శమీ వృక్షానికి పూజలు నిర్వహిస్తారు.
యాదగిరి కొండపై దసరా వేడుకలు
శివకేశవులకు ఆరాధ్యక్షేత్రంగా భాసిల్లుతు దాన్న యాదాద్రి క్షేత్రంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. విజయదశమి రోజున శనివారం కొండపైన శమీ పూజలు చేస్తారు.యాదగిరి కొండపై సాయంత్రం 5:30 శమీ పూజ నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. శ్రీ స్వామివారి ప్రధానాలయ ప్రాంగణంలోని తూర్పు రాజగోపురం ముందు షమీ పూజ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో భాస్కరరావు తెలిపారు. జమ్మి చెట్టును తెచ్చి పూజలు చేస్తారు. పూజలు ముగిశాక జమ్మి ఆకును తీసుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొండపైన శివాలయంలో దుర్గాదేవి నవరాత్రులను కూడా తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాల్లో అమ్మవారి వైభవాన్ని భక్తులకు తేటతెల్లం చేసేలా నిర్వహించారు. చివరి రోజు మహిషాసురమర్థినిగా భక్తులకు దర్శనమిస్తారు.
మహార్నవమి వేళ… ఆయుధ పూజలు
దసరాకు ముందు రోజు మహార్నవమిని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయుధ పూజలు నిర్వహించారు. ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే వస్తు, వాహనములకు పూజలు నిర్వహించి శుభము కలిగేలా చూడమని వేడుకున్నారు. బస్సులు, కార్లు, బైకులకు పూజలు నిర్వహించడం పరిపాటి. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో కూడా మహానవమి సందర్భంగా ఆయుధ పూజల నిర్వహించారు. పలు పోలీస్ స్టేషన్లు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఎస్పీఎఫ్ పోలీసులు ఆయుధాలకు పూజలు నిర్వహించారు.