ఇండియన్ బాక్సాపీసుపై చమక్కున మెరవడానికి వస్తున్న మరో వండర్ `రాధేశ్యామ్`. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో యువీ సంస్థ నిర్మించింది. `జిల్` వంటి కేవలం ఒకే ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన దర్శకుడు రాధా కృష్ణకుమార్ తన టాలెంట్‌తో 2వ సినిమానే పాన్ ఇండియా మూవీగా తెరపైకి తీసుకువస్తున్నాడు. ఇప్పటికే హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారిన ఈ చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
చేతి రేఖలని బట్టి వారి భవిష్యత్తుని వారి ప్రాణాలు ఎప్పుడు పోతాయో.. టోటల్ గా వారి జీవిత కాల చక్రాన్ని చెప్పగల పామిస్ట్ గా విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. విధి ఆడిన వింత ఆటలో ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా` అనే కాన్సెప్ట్ నేపథ్యంలో `టైటానిక్` ని తలపించే దృశ్యాలతో విజువల్ వండర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా దర్శకుడు `రాధేశ్యామ్` స్క్రిప్ట్ వెనకున్న కథని బయటపెట్టి షాకిచ్చారు. ఈ సంచలన చిత్రాన్ని తీయడానికి నాలుగేళ్లు పట్టిందన్నారు. అంతేకాకుండా ఈ చిత్ర స్క్రిప్ట్ వెనకున్న ఆసక్తికరమైన అసలు కథని బయటపెట్టారు. ఈ స్క్రిప్ట్ రాయడానికే 18 ఏళ్లు పట్టిందని ఎవరూ ఊహించని షాకిచ్చారు. ఈ సినిమా పాయింట్ ని ముందు తమ గురువు చంద్ర శేఖర్ ఏలేటి వద్ద విన్నానని, ఆ సమయంలో ఏలేటి గారు ఈ కథని జాతకాల నేపథ్యంలో రాస్తున్నామని, ఎవరికి రాసిపెట్టి వుందో అని అన్నారని తెలిపారు. ఆ తరువాత ఈ కథని 18 ఏళ్లు ఇండియాలో వున్న పెద్ద పెద్ద రైటర్లతో రాయించామని, కానీ కన్క్లూజన్ మాత్రం దొరకలేదన్నారు. అయితే చంద్రశేఖర్ ఏలేటికి ఈ కథ ఛాలెంజింగ్ గా వుండాలని భావించి తానే ఈ కథని పూర్తి చేసి ప్రభాస్ కు వినిపించానని చెప్పారు. ఇది ప్రభాస్ కి రాసి పెట్టి వుంది. ఒక ఫిలాసఫీని ఒక కథలా రాసి ఆయనకు చెప్పాను. ఆయనకు కూడా బాగా నచ్చింది. ఈ సినిమాలో ఫైట్లు ఛేజ్ లు వుండవు.. ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలు ఉంటాయి. ఒక అమ్మాయి కోసం ఓ అబ్బాయి సప్త సముద్రాలు దాటి ముందుకెళ్లే జర్నీనే ఈ ప్రేమకథ అని చెప్పుకొచ్చారు.