స్వస్తి వాచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము జరిపిన అర్చకులు
ఉదయం వేళ…తిరు వెంకటపతి అలంకారంలో శ్రీలక్ష్మీ నరసింహుడు
రాత్రివేళ ఘనంగా అంకురార్పణ పర్వం
పరమపద నాధుని గా కొండపై దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు
ఆకట్టుకున్న హరీష్ బృందం సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట, మే 13 (రోమింగ్ న్యూస్):
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శ్రీ వారి జయంతి మహోత్సవాలు వేద మంత్రాల ఘోషలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి.
ఆలయంలో ఉదయం స్వస్తి వాచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము వేడుకలను పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ప్రధానార్చకులు నలందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు ముఖ్య అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు ఆధ్వర్యంలోని అర్చకులు … వేదపండితుల వేద ఘోష లో ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని తిరువేంకటపతి అలంకారంలో తిరువీధుల్లో భక్తులకు దర్శనం కలిగించారు.
అనువంశిక ధర్మకర్త బీ. నరసింహమూర్తి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్. గీత సహాయ కార్యనిర్వహణాధికారులు గజవెల్లి రమేష్ బాబు, దోర్బల భాస్కర్ శర్మ, గట్టు శ్రావణ్ కుమార్, వేముల రామ్మోహన్, జుసెట్టి కృష్ణ, పర్యవేక్షకులు నరేష్ కుమార్, శర్మ, రాకేష్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
తిరు వెంకటపతి అలంకార ప్రత్యేకత:
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరువేంకటపతి అలంకార సేవలో భక్తకోటిని భగవానుడు అనుగ్రహించడం ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. భక్తుల అన్ని పాపాలను తొలగించేందుకు వెంకటేశ్వరస్వామిగా ఏడుకొండలను ఆశ్రయించి భక్తకోటిని అనుగ్రహించిన తీరును అర్చకులు వివరించారు. ‘వేం’ అనగా పాపం అని, కటం అనగా తొలగించుట అని, అనగా ఆనందాన్ని కలిగించుట అని అర్థం. అన్నమాచార్యులు,త్యాగరాజు మొదలైన వాగ్గేయకారులు కూడా వెంకటేశ్వర స్వామిని వెంకట, రామా, నరసింహుడిగా కీర్తించారు. ఈ మూడు తత్వాలు ఒకటే అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ మూడింటి మూల తత్వము నరసింహుడుగా పేర్కొనటం వల్ల సర్వంతర్యామీ అయిన నరసింహుడే వివిధ రూపాలలో దర్శనభాగ్యం కలిగించి అనుగ్రహిస్తారని వేదాలు, ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి.
- మొదలైన నిత్య పారాయణాలు*
సాయంత్రం శ్రీ స్వామివారి ఆలయంలో సామూహిక పారాయణాలు ప్రారంభమయ్యాయి.
వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా సాయంత్రం అంకురారోపణం జరిపారు. హవనం నిర్వహించారు. శ్రీ స్వామి వారిని పరమ వాసుదేవుడి గా అలంకరించి గరుడ వాహనంపై ఊరేగించారు.
పరమ వాసుదేవ అలంకార సేవ ప్రత్యేకత
జయంతి మహోత్సవంలో భాగంగా పంచ నారసింహ క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీ స్వామివారిని, అమ్మవార్లను పరమ వాసుదేవ తత్వములుగా అలంకరణ చేసి తిరువీధుల్లో ఊరేగించారు. వైకుంఠంలోని దివ్యమైన సౌందర్య స్వరూపమే పరవాసుదేవ తత్వమని అర్చకులు తెలిపారు. పరమపద నాథుడిగా తన ఆశ్రితులకు తన దివ్యమైన చరణాలను దర్శింపచేసేందుకు పరమపద సూచకంగా పరమపదనాధుడనీ పురాణాలు పేర్కొంటున్నాయి. పరమపద నాధుని దర్శించిన జీవుడు ముక్త పురుషులు పొందే ఆనందము… అనిర్వచనీయమైనది. కలియుగంలోని మలిన జీవులు పరమపదం చేరుట కష్టతరమైనందువలన వాత్సల్య దయామయుడు అయిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు జయంతి వేడుకలలో భక్తకోటికి పరమపద నాథుడుగా దర్శనం కలిగించి అనుగ్రహించారనీ ప్రధానార్చకులు వివరణ చేశారు.
పాత గుట్ట ఆలయంలో
పాత లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు శుక్రవారం స్వస్తివాచనం నిర్వహించి విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను ప్రారంభించారు. సాయంత్రం అంకురారోపణం, హవనం నిర్వహించారు.
మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు
యాదాద్రి ప్రధానాలయం నిర్మాణం పనులు పూర్తయ్యాక జరుగుతున్న మొట్టమొదటి జయంతి కార్యక్రమాలలో పాల్గొనే భక్తుల కోసం
వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా తరలి వచ్చే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం శ్రీరామ భక్త భజన మండలి మల్లాపురం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి భజన మండలి సభ్యులచే భజన జరిగింది. సాయంత్రం జి. జానకి బృందం వారిచే భక్తి సంగీతం ఆకట్టుకుంది. యాదాద్రి డాన్స్ అకాడమీ వారిచే నృత్య కార్యక్రమాలు జరిగాయి.
యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన జగిని హరీష్ బృందంచే నృత్య ప్రదర్శన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
జగినీ హరీష్ బృందం చేసిన కూచిపూడి, భరతనాట్యం నృత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు తమ హావ భావాలను రక్తికట్టించారు సభికులను ఆనందపరిచారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కరతళధ్వనులతో