యాదగిరిగుట్ట మే 17 (రోమింగ్ న్యూస్): కరోనాను ప్రపంచం నుంచి తరిమి… తరిమి వేయాలని శ్రీలక్ష్మీ నరసింహుడిని వేడుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
మంగళవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయనకు ఉప ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం ఆశీర్వచనం జరిపారు. ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్ శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆయన సీఎం కేసిఆర్ వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసిన యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం గోపురాలను,ప్రాకారాలు ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు.
కరోనా వల్ల రెండేళ్లుగా ప్రపంచమంతా అతలాకుతలమైంది అని చెప్పారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని ప్రపంచం సుభిక్షంగా ఉండేలా చూడాలని లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకుందాం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న ఫలితంగా ప్రాణనష్టం అధికంగా లేకుండా చూడగలిగామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వైద్యరంగంలో మెరుగైన ఫలితాలను సాధించిందని, పేద వారికి కూడా మంచి వైద్యం అందిస్తున్నామని డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల రాష్ట్రంలో వైద్యం మెరుగుపడిందని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. కెసిఆర్ తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గల ఆసుపత్రుల నీ బలోపేతం కావడం జరిగిందని వైద్యులు చక్కగా పని చేస్తున్నారని ఎక్కడికక్కడ కఠినమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు.
తిరుమల కు దీటుగా యాదాద్రి
లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం తిరుమల కు ధీటుగా నిర్మాణం జరుపుకున్నదని డాక్టర్ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. నాడు శ్రీ కృష్ణ దేవరాయలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మాణం చేస్తే… నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యాదాద్రి నిర్మాణం చేసి ప్రపంచమంతా ఆనందపడే అలా చేశారని కెసిఆర్ ను ఆయన పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రతి ఒక్కరూ తెలంగాణ లో యాదాద్రి ఉండడం గర్వకారణంగా భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ యాదాద్రికి వస్తున్నారని యాదగిరిగుట్ట యొక్క వైభవం మరింత పెరిగిపోయిందని ఆయన తెలిపారు.