భువనగిరి, ఆగస్టు 14 (రోమింగ్ న్యూస్): భువనగిరి పట్టణానికి చెందిన డాక్టర్ కొప్పుల సృజనారెడ్డి గైనకాలజీ విభాగంలో
ఉస్మానియా కాలేజీలో ప్రథమ ర్యాంకు సాధించి పలువురి మన్ననలు పొందుతున్నారు. భువనగిరి పట్టణంలో ప్రముఖ హోమియో వైద్యనిపుణులు కొప్పుల రఘుపతి రెడ్డి, స్వరూపల కుమార్తె అయిన సృజనారెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజీలో గైనకాలజీ లో ఎమ్మెస్ చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆమె తన సత్తా చూపించారు. కాలేజీ ఫస్టు ర్యాకు రావడం పట్ల పలువురు వైద్య నిపుణులు, ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సృజనారెడ్డి మొదటినుంచి చక్కటి ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తూ ఎస్.వీ.ఎస్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో ఎం.బీ.బీ.ఎస్ లో సీటు సంపాదించారు. ఆ తర్వాత నిర్వహించిన పీజీ పరీక్షల్లో కూడా ఆమె జాతీయ స్థాయిలో 4900 ర్యాంకు సాధించారు. జాతీయస్థాయిలో నిర్వహించిన పీజీ ప్రవేశపరీక్షకు అప్పట్లో 1,48,003 మంది హాజరయ్యారు. మొత్తం 1200 మార్కులకు గాను 713 మార్కులు సాధించి సృజనారెడ్డి అప్పట్లోనే అందరి మన్ననలు పొందారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించిన తర్వాత ఆమె గైనకాలజీ లో అద్భుతమైన ప్రతిభ పాటవాలను ప్రదర్శిస్తు ఎమ్మెస్ పూర్తి చేశారు.ఆమె చూపించిన చొరవ… శ్రద్ద కాలేజీ ప్రథమ ర్యాంకును సాధించిపెట్టాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మొదటి ర్యాంకు సాధించిన మొదటి భువనగిరి డాక్టర్ గా సృజన రెడ్డి సరికొత్త చరిత్ర కి శ్రీకారం పలికారు. ఆమెకు కాలేజీ మొదటి ర్యాంకు రావడం పట్ల భువనగిరికి చెందిన పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు. ఎమ్మెస్ లో సృజనను ప్రోత్సహించిన ప్రొఫెసర్లకు ఆమె తల్లదండ్రులు కొప్పుల రఘుపతి రెడ్డి, స్వరూపలు కృతజ్ఞతలు తెలిపారు.