యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి సంబరాలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారని యాదగిరిగుట్ట ఎస్.వీ.ఎన్ రెసిడెన్షియల్ హైస్కూల్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ అన్నారు. శనివారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన దీపావళి సంబరాల పై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరకాసురుని వధ చేయడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు చెడుపై విజయం సాధించి సర్వలోకాలకు సుఖం… శాంతిని కలిగించారని నరకాసురుని వధించి లోకాలకు అతని పీడ నుంచి విరగడ చేసినందుకు గానూ మంగళ హారతులు పట్టి శ్రీకృష్ణుడు… సత్యభామలకు ప్రజలు స్వాగతం పలికిన సన్నివేశాలను ఆయన విద్యార్థులకు వివరించారు.
ప్రస్తుత తరుణంలో విద్యార్థులు టపాకాయలను వాడటంలో మెళకువలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు చీకట్లను చీల్చి వెలుగులను పంచేందుకు తారాజువ్వలు ఉపయోగించారని కానీ నేడు ఫ్లడ్లైట్ల వెలుగులు చీకట్లను తరిమేసి వెలుగు జిలుగులతో కనువిందు చేస్తున్నాయని చెప్పారు.
అయితే టపాకాయలను నియమిత పద్ధతిలో వాడడం వల్ల నియమిత సమయాల్లోనే కాల్చడం వల్ల వాయు కాలుష్యం నుంచి రక్షించిన వారమవుతామని వివరించారు. ఎస్.వీ.ఎన్ డైరెక్టర్ గొట్టిపర్తి మాధురి మాట్లాడుతూ విద్యార్థులు చాలా జాగ్రత్తలు తీసుకొని మాత్రమే టపాకాయలను కాల్చాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నది.
శ్రీమహాలక్ష్మీ అమ్మవారు శిఖర సింహాసనంలో కూర్చోగా ఆమె చెలికత్తెలు అంతా సేవలు చేస్తున్న అనుభూతిని కలిగించే విధంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా బొమ్మలకొలువు వద్ద ఫోటోలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు యూసుఫ్, హరీష్, గీత, రాజేంద్ర ప్రసాద్, నవీన్, పి. గీత, నిఖిత, సాహితీ, మహేశ్వరి, సంగీత, సరళ, సుకన్య తదితరులు పాల్గొన్నారు.