RN DAILY     G9 TELUGU TV    ePaper

గుట్ట ఎమ్మార్వో అవినీతి పై సీరియస్ అయిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

యాదగిరిగుట్టలో విచారణ చేసిన ఆర్డీవో భూపాల్ రెడ్డి

సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసిన సీసీఎల్ఏ అధికారులు

యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:
యాదగిరిగుట్ట తహసిల్దార్ వి.శోభన్ బాబు పట్టాదారు పాస్ పుస్తకం కోసం రైతు వద్ద నుండి లంచం డిమాండ్ చేసిన విషయంలో విచారణ జరిపిన అధికారులు సస్పెన్షన్ ఆదేశాలను జారీ చేశారు. భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి శుక్రవారం యాదగిరిగుట్ట తహసిల్దార్ కార్యాలయం చేరుకొని వివరాలను సేకరించి అధికారులకు సమాచారం పంపారు. ఈ మేరకు సీసీఎల్ఏ అధికారులు అవినీతికి మరిగిన తహసిల్దార్ వి. శోభన్ బాబును సస్పెండ్ చేస్తూ ఆదేశాలను వెలువరించారు. పాస్ బుక్ కోసం వెళ్లిన రైతును రూ. ఐదువేలు డిమాండ్ చేసిన ఘటనలో సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయడం రెవెన్యూ శాఖలో కలకలం సృష్టించింది. అవినీతికి మరిగిన అధికారులకు ఈ సస్పెన్షన్ ఒక బెదిరింపుగా మాత్రమే పనికొస్తుందని విచారణ జరిపి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోమింగ్ న్యూస్ దినపత్రికలో ఎమ్మార్వో శోభన్ బాబు వ్యవహార శైలిపై సమగ్ర కథనం రావడంతో పాటు దాన్ని ట్విట్టర్లో ఐటీ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేయడంతో ఆయన కూడా స్పందించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎంఆర్ఓ కార్యాలయాలలో ఏర్పాటుచేసిన రిజిస్ట్రేషన్ల కార్యక్రమం అధికారుల అవినీతి వల్ల అభాసుపాలు అవుతున్నది. డబ్బులు ఇస్తే తప్ప రిజిస్ట్రేషన్లు చేయని పరిస్థితి నెలకొన్నది. రైతులు, రిజిస్ట్రేషన్ కు వచ్చిన వ్యాపారులను జలగల్లా పట్టిపీడిస్తున్నారు.శోభన్ బాబు వ్యవహారం ప్రింట్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం తాసిల్దారును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జిల్లాలో సంచలనం కలిగిస్తున్నది. నాకు ఎదురు లేదు… ఎవరైతే నాకేమిటి నాకు ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే అనే డిమాండ్ తో యాదగిరిగుట్టలో విధులు నిర్వహించిన శోభన్ బాబు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం విశేషం.

ఎమ్మార్వోలకు హుకుం జారీ చేసిన జిల్లా కలెక్టర్

యాదాద్రి జిల్లాలోని ఎమ్మార్వో కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై రోమింగ్ న్యూస్ దినపత్రికలో సమగ్ర కథనం రావడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వ్యాపారులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దని అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్న వారికి పది నిమిషాల్లో పని పూర్తి చేసి పంపించాలని ఆదేశించారు. కలెక్టర్ తన పరిధిలోని ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేయగా, వారు తమ పరిధిలోని ఎమ్మార్వోలకు సమాచారం చేరవేసి నిఘా ఎక్కువ ఉన్న యాదగిరిగుట్ట లాంటి ప్రాంతాల్లో ఇంకా జాగ్రత్తగా పని చేయాలని ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.

పారదర్శకంగా పని చేయాలి: భూపాల్ రెడ్డి
పారదర్శకంగా పనిచేయాలని భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి యాదగిరిగుట్ట కార్యాలయ సిబ్బందికి హితోపదేశం చేశారు. శుక్రవారం ఆయన గుట్ట ఎమ్మార్వో కార్యాలయంలో తనదైన శైలిలో ఉద్యోగులతో సుదీర్ఘంగా అనేక విషయాలపై చర్చించారు. దేవుడు మనకు ఉద్యోగ అవకాశం ఇచ్చింది… ఇష్టారాజ్యంగా పనిచేయడానికి కాదు… ప్రజల ప్రేమ, అనురాగం పొందే విధంగా పనిచేస్తూ మన్ననలు పొందాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉద్యోగిపై, అధికారిపైపై నిఘా ఉన్నదని తాసిల్దారే కాకుండా ఇంకా ఇక్కడ పనిచేస్తున్న అధికారులు తమ వంతు బాధ్యతగా నిజాయితీగా పని చేయాలని ఆయన వారికి హితోపదేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!