యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గురువారం ఉదయం నిర్వహించిన గిరిప్రదక్షిణ భక్తుల భక్తి పారవశ్యంతో… ఆధ్యాత్మికతకు అలవాలంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్. భాస్కరరావు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు…
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని స్తుతించే పాటలు ఒకవైపు… మహిళా భక్తుల కోలాటాలు మరో వైపు… కళాకారుల నృత్యాల సందడిలో గిరి ప్రదక్షణ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీలక్ష్మీనరసింహుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆయన ఆశీర్వాదం లభించాలన్న పట్టుదలతో చలిని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీలక్ష్మీ నరసింహ జై… యాదగిరి వాస జై అంటూ స్వామివారి పాటలు పాడుకుంటూ భక్తులు ముందుకు సాగిపోయారు. ఈ సందర్భంగా యాదరుషి మండపాన్ని బీర్ల ఐలయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు.
శ్రీలక్ష్మీ నరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో శతఘటాభిషేకం నిర్వహించారు. 100 కలశాలలో మంత్రించిన జలములతో శ్రీవారికి అభిషేకం నిర్వహించారు. తన ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహచార్యులు, కాన్డూరి వెంకటాచార్యులు, ఆలయ ఉప ప్రధాన అర్చకులువజ్జల లక్ష్మణాచార్యులు…వేద పండితుల వేదమంత్రాల ఘోషలో సుమారు రెండు గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాల సందడి
స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా కొండపైన *శ్రీ వేంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సంస్కృతి* తెలంగాణ వారి ఆధ్వర్యంలోకూచిపూడి నృత్యాలను నిర్వహించారు. తాళ్లపాక అన్నమాచార్యుల 12 వతరం వారసులు తాళ్లపాక స్వామీజీ వారి దివ్య మంగళ శాసనాలతో కార్యక్రమాలు రూపకల్పన చేశారు.అన్నమయ్య సేవలో భాగముగా కూచిపూడి నృత్య కళాకారులతో అన్నమయ్య సంకీర్తన అష్టోతర నాట్యకుసుమాంజలి బృందనాట్యముతో మొదలయ్యాయి.
సంస్థ సెక్రటరీ తాళ్లపాక గౌరీ ప్రసూనా నిర్వహణ లో డైరెక్టర్ మీనాక్షి శ్రీనివాస్ పర్యవేక్షణలో నాట్య గురువులు నళిని రమణ, కోమలి శంకర్, కందాడా హరిణి, మాస్టర్ వినోద్ శిష్య బృందములచే కూచిపూడి, భరత నాట్యము, అన్నమయ్య సంకీర్తనలతో కోలాట కార్యక్రమములు నిర్వహించారు.