భువనగిరి ఎం.వీ.ఐ ఆనంద్ శ్యాంప్రసాద్
ఆలేరు, జనవరి 2:(రోమింగ్ న్యూస్):విద్యార్థి దశలో ఉన్నప్పుడే రోడ్ సేఫ్టీ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని భువనగిరి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్. ఆనంద్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలోని జేఎంజే స్కూల్లో గురువారం నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ట్రాఫిక్ రూల్స్ ను పాటిద్దాం… రోడ్డు ప్రమాదాలను నివారిద్దామని ఆయన చెప్పారు.మైనర్లకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. అందువల్ల డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాన్ని నడపడం నేరమని వివరించారు. విద్యార్థుల్లో ఈ విషయంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. స్కూటీలు, బైకులు విరివిగా వాడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.
టాబ్లెట్ల కోసం, పాలు… పెరుగు కోసం… చిన్న చిన్న కిరాణా సామాన్ల కోసం తల్లిదండ్రులు బైక్ లను ఇచ్చి పంపుతుంటారని తెలిపారు. పరోక్షంగా ప్రమాదాలకు తల్లిదండ్రులే కారణమవుతున్నారని చెప్పారు లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని వివరించారు.
దీనిపైన ఖచ్చితమైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో రోడ్డు భద్రత సందర్భంగా వివరించాలని గట్టి నిర్ణయం తీసుకోవడంతో పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనాన్ని నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. కారు నడుపుతున్నట్లైతే సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. రోడ్డు దాటడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. అంతేకాకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా అతివేగం ప్రమాదకరమని ఆయన హితవు చెప్పారు. నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేయడం వల్ల విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, భువనగిరి ఆర్టీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.