ప్రమోషన్ పొంది బెనిఫిట్స్ అమలు కాని విషయంపై స్పందించిన కమిషనర్
టీఎన్జీవో నాయకులను సన్మానించిన అధ్యక్షులు రమేష్ బాబు… గుట్ట దేవస్థానం అధికారులు
హైదరాబాద్, రోమింగ్ న్యూస్: ఇటీవల బదిలీపై వివిధ దేవాలయాలలో పని చేస్తున్న ఉద్యోగులలో అనారోగ్య సమస్యలున్న వారిని, భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్న వారిని వెంటనే తమ తమ మాతృ సంస్థలకు బదిలీ చేయాలనే విషయంలో దేవాదాయ కమిషనర్ సానుకూలంగా స్పందించడం పట్ల దేవాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజవెల్లి రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. గురువారం టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ముజీబ్ లకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞత పూర్వకంగా శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించారు. టీఎన్జీవో సంఘ నాయకుల తో కలిసి కమిషనర్ ను కలిసిన సందర్భంగా దేవాలయ ఉద్యోగుల పట్ల కమిషనర్ సానుకూలంగా స్పందించారని ఆయన మీడియా ప్రతినిధులకు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ వంటి చిన్న కేడరులలో పని చేస్తూ బదిలీ అయిన వారిని తిరిగి వారి వారి మాతృ సంస్థలకు బదిలీ చేయాలని చేసిన సూచనను కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రధాన దేవాలయాల జెఎసి చైర్మన్ జి.రమేష్ బాబు, యాదగిరిగుట్ట ఏఈఓ, జూశెట్టి కృష్ణ, ఏఈఓ, ప్రతాప నవీన్ కుమార్, ఏఈఓ, దాసోజు నరేష్, పర్యవేక్షకులు, యెరకల దయానంద్ తదితర యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు టిఎన్జీవో నాయకులతో కలిశారు.ఈ సందర్భంగా టిఎన్జీవో నాయకులకు దేవస్థానం అధికారులు పలు విషయాలపై అవగాహన కల్పించారు. మాతృ సంస్థల బదిలీల విషయంతో పాటు పేపర్ ప్రమోషన్ పొంది ప్రమోషన్ బెనిఫిట్స్ పొందలేకపోతున్న ఉద్యోగులకు వెంటనే సదరు బెనిఫిట్స్ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలనే విషయం పైన కూడా దేవాదాయశాఖ కమిషనర్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకొని కమిషనర్ కు విజ్ఞాపన పత్రాలు అందజేసి, మాట్లాడినందుకు టీఎన్జీవో రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ మరియు ముజీబ్ లకు ప్రధాన దేవాలయాల తరఫున వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.