RN DAILY     G9 TELUGU TV    ePaper

శ్రీలక్ష్మీనరసింహుని దివ్య విమాన రాజగోపురానికి వేగిరంగా బంగారు తాపడం పనులు

ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు

మహా కుంభ సంప్రోక్షణ విజయవంతానికి దిశా నిర్దేశం చేసిన ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్

అధికారులతో జరిగిన సమీక్షలో పాల్గొన్న యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభ సంప్రోక్షణను ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నడుం బిగించారు. బుధవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎన్. శ్రీధర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.మహా కుంభసంప్రోక్షణ ఫిబ్రవరి 23న జరుగుతుందని అర్చకులు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎన్. భాస్కరరావుతో సహా పోలీసు అగ్నిమాపక, రెవెన్యూ, దేవస్థానం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశాన్ని ఉద్దేశించి కమిషనర్ ప్రసంగించారు. మహా కుంభ సంప్రోక్షణ ఉత్సవాల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని వారు ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి విచ్చేసే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, భక్తులకు సకల సదుపాయాలు కల్పించాలని వివిధ శాఖల అధికారులకు కమిషనర్ దిశా నిర్దేశం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమాన స్వర్ణ గోపుర పూజా కార్యక్రమాలను శాస్త్రానుసారం వైభవోపేతంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలపై వారు దేవస్థానం ప్రధాన అర్చకులు, వేద పండితులతో కూడా సమీక్ష సమావేశంలో చర్చించారు.

దేశంలోని నదుల నుంచి పుణ్య జలాలను సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్

యాదగిరిగుట్ట శ్రీ స్వామి వారి దివ్య విమాన రాజగోపుర మహా సంప్రోక్షణకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పుణ్య నదుల నుండి పవిత్ర పుణ్య జలాలను సేకరించే కార్యక్రమాన్ని కూడా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ ప్రారంభించారు. అర్చకులు, వేద పండితులను పవిత్ర నది జలాల సేకరణకు పంపే కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వివిధ నదుల నుంచి వారు ఈ సందర్భంగా నదీ జలాలను సేకరించి దేవస్థానానికి తీసుకువస్తారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు జరిగే కార్యక్రమంలో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. సమీక్షలు దేవస్థానం అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అదనపు డిప్యూటీ కమిషనర్ లక్ష్మి కాంతారావు, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, ఏసీపీలు సైదులు, రమేష్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు పోలీసు ఇన్స్పెక్టర్లు, దేవస్థానం ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు, కాండూరు వెంకటాచార్యులు, బట్టర్ సురేంద్ర చార్యులు, లక్ష్మణాచార్యులు, అధికారులు పాల్గొన్నారు.

గుట్టలో కమీషనర్ పూజలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాల విజయవంతం కోసం సమీక్ష నిర్వహించేందుకు విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎన్. శ్రీధర్ కు దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వచనం జరిపి శ్రీవారి శాలువా జ్ఞాపికలను అందజేశారు. దేవస్థానం ఈఓ. ఎన్ భాస్కరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు, అర్చక బృందం ఆశీర్వచనం జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!