గతం కన్నా భిన్నంగా ఈసారి గుట్ట బ్రహ్మోత్సవాలు: ఈఓ
బ్రహ్మోత్సవాల బడ్జెట్ మూడు కోట్ల పైమాటే…!!
మార్చి 1 నుండి 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
7న స్వామివారి ఎదుర్కోలు,
8న తిరుకల్యాణ మహోత్సవం 9న దివ్య విమాన రథోత్సవం
బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు ఆర్జిత సేవలుబంద్
సమావేశంలో వెల్లడించిన ఈవో ఏపూరి భాస్కర్ రావు.

యాదగిరిగుట్ట, రోమింగ్ న్యూస్:మార్చి ఒకటి నుండి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు షురూ కానున్నాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఈసారి మూడు కోట్ల పది లక్షలుగా బడ్జెట్ ఖరారు చేసినట్లు దేవస్థానం ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. గత సంవత్సరం కూడా ఇదే బడ్జెట్ తో ఉత్సవాల నిర్వహిన జరిగిందని ఆయన వివరించారు.

మార్చి ఒకటి నుండి 11 వరకు.. 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఆలయ ఈవో ఎపూరి భాస్కర్ రావు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.మార్చి 1న శనివారం విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురారోపణం పూజలతో వార్షిక బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలు 7న స్వామివారి ఎదుర్కోలు, 8న తిరుకల్యాణ మహోత్సవం, 9న దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నారు.
11న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం పూజలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల కారణంగా నిత్యం భక్తులచే నిర్వహింపబడే ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను 11 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం 12 నుండి ఆర్జిత సేవలను తిరిగి పునరుద్ధరణ చేయనున్నారు.
గవర్నర్ కు ఆహ్వానం
రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మను యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కరరావు అందజేశారు. రాజ్ భవన్ కు వెళ్లి ఆలయ అర్చకులు మొదటగా గవర్నర్ ను ఘనంగా సన్మానించారు. దేవస్థానం ప్రసాదాన్ని అందజేశారు శేష వస్త్రాన్ని కప్పి సన్మానించారు.


