హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఆయన అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక చేరింది. ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా నివేదికలో తేల్చినట్లు ప్రచారం జరుగుతోంది. రేపోమాపో టెక్నికల్ ఆధారాలతో ఆయనపై కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆయనపై వేటు పడనుండా? అనే చర్చ ఊపందుకుంటోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ తొలుత ఒక అఫిడవిట్ సమర్పించారు. నవంబర్ 14న ఆయన నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేశారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే కొద్దిరోజుల ముందు వెబ్పైట్లో మరో అఫిడవిట్ దర్శనమిచ్చింది. మొదట అప్లోడ్ చేసిన అఫిడవిట్లో వివరాలు.. తర్వాత అఫిడవిట్లో వివరాల్లో తేడాలున్నట్లు ప్రత్యర్థులు గుర్తించారు.
తొలుత అప్లోడ్ చేసిన అఫిడవిట్తో అనర్హత వేటు పడే అవకాశం ఉండడంతోనే ఆయన మరో అఫిడవిట్ను అప్లోడ్ చేయించారని ప్రత్యర్థులు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్సైట్ను ట్యాంపరింగ్ చేసి మరీ అఫిడవిట్ మార్చేశారని ఎన్నికల కమిషన్కి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన కమిషన్ ఎన్నికల అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బదిలీపై వెళ్లిన మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు తెలుస్తోంది. ట్యాంపరింగ్ ఆరోపణలు నిజమేనని నివేదికలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంకేతిక ఆధారాలు సేకరించేందుకు ఈసీ కూడా అంతర్గత విచారణ చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.