అసమానతలు ప్రదర్శించే మోడీ సమతా మూర్తి బోధనలు చేయడం విడ్డూరం
ప్రధాని వ్యాఖ్యలను ఖండించడానికి కేసీఆర్ కు భయం ఎందుకు
కాంగ్రెస్ ను విమర్శించే బీజేపీ, టీఆర్ఎస్ నాయకులకు తలకాయలో మెదడు ఉందా?
మోడీ, హరీష్ రావులది నాలుకలా? తాటి మట్టలా…?
మీడియా సమావేశంలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (రోమింగ్ న్యూస్):
ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులో వివక్షత పాటించిన ప్రధాని మోడీ సమతామూర్తి బోధనలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అక్కసు వెల్లగక్కిన మోడీ నిజస్వరూపం మరోసారి బయటపడిందని అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు పార్లమెంట్లో లేని మోడీ ఇప్పుడు రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరిగిందని అక్కసు వెళ్లగక్కడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాల్సిన సీఎం కేసీఆర్ రెండు రోజులుగా బయటకు రాకుండా మౌనంగా ఉండటం సిగ్గుచేటుగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ బయటకు వచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఖండించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పాలని సూచించారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మౌనం వీడకుంటే… మోడీ-కేసీఆర్ కలిసి ఆడుతున్న నాటకాలుగా భావించాల్సి వస్తుందని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ముందే తెలిసినప్పటికీ, పార్లమెంట్లో యూపీఏ, ఎన్డీఏ పక్షాలను ఒప్పించి ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్దంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను విమర్శిస్తున్న బిజెపి, టిఆర్ఎస్ నేతలకు తలకాయలో మెదడు ఉందా? వారివి నాలుకలా?…తాటి మట్టలా?.
అని పరోక్షంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అయిందని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉన్నందునే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు ఉద్యమ నేత అని గొప్పలు చెప్పుకుంటున్న కెసిఆర్ లేకపోయినా సోనియాగాంధీ అందర్నీ ఒప్పించి తెలంగాణ ఇప్పించిన చరిత్రను మరిచి హరీష్ రావు సోయిలేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్రానికి అత్యధికంగా పన్నుల రూపంలో ఆదాయం ఇస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఉత్తరాది రాష్ట్రాలకు నిధులు ఇచ్చి వివక్ష ప్రదర్శిస్తున్న మోడీకి దేశ సమైక్యత, సమగ్రత, సమానత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలకు అత్యధికంగా నిధులు కేటాయిస్తూ తెలంగాణను మోడీ చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరిని సమానంగా చూడాల్సిన ప్రధాని వివక్షతను ప్రదర్శిస్తూ అందరూ సమానమే అన్న రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్టాపనకు పూర్తిగా అనర్హుడని అన్నారు. బిజెపి రాజకీయ వేదికగా రామానుజ చార్యులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నందున దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
మత విద్వేషాలను రెచ్చ గొడుతున్న మోడీ సర్కార్
ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బిజెపి లబ్ధి పొందడానికి కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం సృష్టించి మోడీ సర్కార్ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. హిజాబ్ ఇవ్వాళ కొత్తగా ఉన్నది కాదని, కాని ఇప్పుడే ఎందుకు అల్లర్లు అవుతున్నాయో అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరినీ సమానంగా చూడాలి అన్న రామానుజ చార్యుల సమతభావం స్పూర్తికి విరుద్ధంగా దేశంలో మోడీ పరిపాలన కొనసాగుతోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విభజనను ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్ధంగా చేసిందని అందులో భాగంగా 2014 విభజన చట్టాన్ని తీసుకో వచ్చిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ తెలంగాణ లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడంతో పాటు 8 ఏళ్లుగా విభజన చట్టాన్ని తుంగలో తొక్కినాడని విమర్శించారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రేస్ పార్టీ
అని మోడీ మరో సారి పార్లమెంటు సాక్షిగా ఒప్పుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
కానీ రాజకీయ లబ్దికోసం మోడీ కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించాలనే దుర్బుద్ధితో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్- నరేంద్రమోదీ కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళకుండా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరం ఫ్రీ జోన్ కాకుండా తెలంగాణలో అంతర్భాగం అనే విధంగా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఐటి ఉద్యోగాలు తెలంగాణ యువతకు వస్తున్నాయా? ఎవరికి వెళ్తున్నాయో కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా మోడీ వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ నోరు మెదుపకుండ ప్రగతి భవన్ నుంచి బయటకు రాకపోవడం సిగ్గుగా ఉందన్నారు. మోడీ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించాలన్నారు.
సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపన లో ఏకానామికల్ అఫెండర్స్ కు ప్రాధాన్యత కల్పించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కార్యక్రమాన్ని బిజెపి రాజకీయ వేదిక మార్చుకోవడానికి చిన్న జీయర్ సహకరిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.