RN DAILY     G9 TELUGU TV    ePaper

కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు జిల్లా సి.బెళగల్ ఎమ్మార్వో జె.శివశంకర నాయక్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2,000 లు జరిమానా విధించింది.

వివరాల్లోకి వెళితే…సి.బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన పింజరి కరీం సాబ్ అదే మండల పరిధిలోని కొత్తకోట గ్రామం సరిహద్దులో సర్వే నెం. 430/ 1 లో 11 ఎకరాల 73 సెంట్ల తన సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

తన భూమికి సంబంధించి మ్యుటేషన్ నిమిత్తమై స్థానిక ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోగా ఆయన గ్రామ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కరీం సాబ్ దరఖాస్తును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కరీం సాబ్ తనకు న్యాయం చేయమని కోరుతూ న్యాయవాది చల్లా శివశంకర్ ద్వారా గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం సి.బెళగల్ ఎమ్మార్వో సంబంధిత రైతు మ్యుటేషన్ కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని తీర్పునిస్తూ మ్యుటేషన్ చేయాలని ఆదేశించింది. కాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అమలుచేయకపోవడంతో ఎమ్మార్వో శివశంకర నాయక్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధృవీకరించి ఆయనకు ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.2,000 లు జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు వారాలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!