ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటు కారణంగా సోమవారం హఠాన్మరణం పొందారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. గౌతమ్ రెడ్డి నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు.
వీరిది నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి స్వగ్రామం. గౌతమ్ రెడ్డి 1994-97 నడుమ ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పట్టా పొందారు. అనంతరం ఇక్కడికి వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. అనంతరం వైఎస్సార్ సీపీలో ముఖ్య రాజకీయ నేతగా ఎదిగి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, నేడు మంత్రిగా కొనసాగారు.
1976 డిసెంబర్ 21న జన్మించిన గౌతమ్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ప్రస్తుతం మంత్రి అయ్యారు.