అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు
దసరా సెలవులను తగ్గించేది లేదు
పాఠశాల విద్యా శాఖ స్పష్టీకరణ
ఆనందంలో ఉపాధ్యాయులు
హైదరాబాద్, రోమింగ్ న్యూస్:
దసరా సెలవులు ముందుగా ప్రకటించిన ప్రకారం 14 రోజులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం స్పష్టం చేశారు. అకాడమిక్ క్యాలెండర్ లో పొందుపరిచిన ప్రకారమే సెలవులు ఇస్తున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ముందుగా ప్రకటించినట్లుగా 14 రోజులు హాలిడేస్ ఉంటాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించడం ద్వారా రెండు మూడు రోజుల నుంచి నెలకొన్న సందిగ్ధ పరిస్థితికి తెరపడినట్లయింది.
ముందుగా ప్రకటించిన ప్రకారం సెలవులు ఈనెల 26వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉంటాయని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ ప్రతిపాదనను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తిరస్కరించారు. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, జాతీయ సమైక్యత దినోత్సవానికి స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవులు ఎక్కువ కావడం వల్ల విద్యార్థుల సిలబస్ పూర్తి చేయడం కష్టమవుతుందని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి విద్యాశాఖ అధికారులకు లేఖ రాయడం ఉపాధ్యాయుల్లో కలకలం సృష్టించింది. దసరా సెలవులు తొమ్మిది రోజులకు కుదించాలని లేకుంటే ముందుగా అనుకున్న ప్రకారమే సెలవులు ఇస్తే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు శనివారాలు కూడా స్కూల్లు నడపాలని రాధారెడ్డి విద్యాశాఖ అధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు రావడంతో సెలవులు తగ్గించాలన్న ప్రతిపాదనపై విద్యాశాఖ అధికారులు వెనక్కి తగ్గారు. హిందువుల పండుగలకే అధికారులు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని, హిందూయేతర వేడుకలకు ఎలాంటి అడ్డంకులు చెప్పని అధికారులు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించడంతో విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మొత్తానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు సెలవుల విషయంలో నెలకొన్న సస్పెన్స్ కు తెరదించారు.