RN DAILY     G9 TELUGU TV    ePaper

బీబీనగర్ మహదేవపూర్ లో సైలెన్స్ రిట్రీట్ సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్రపతి.

ఆధ్యాత్మిక జ్ఞానంతోనే ప్రశాంతత: రాష్ట్రపతి

బీబీనగర్, రోమింగ్ న్యూస్:
సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే ప్రశాంతత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మంగళవారం సాయంత్రం బీబీనగర్ మండలం మహాదేవపురం లో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం నిర్మించిన సైలెన్స్ రిట్రీట్ సెంటర్‌ను మౌంట్ అబూ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

అదేవిధంగా బ్రహ్మకుమారీస్ రూపొందించిన జాతీయ స్థాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం ‘రైజ్” ప్రాజెక్టును ముర్ము లాంచ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ప్రశాంతత కనీస అవసరంగా మారిపోయిందని పేర్కొన్నారు.

శాంతి ద్వారానే సమాజంలో స్నేహం, సామరస్యతలు పెంపొందుతాయని ముర్ము చెప్పారు.ప్రకృతిలోని పంచతత్వాల్లాగే ప్రశాంతత కూడా మానవ జీవితానికి ఈశ్వరుడు అందించిన కానుక అని తెలిపారు. ప్రజల జీవితాల్లో ప్రశాంతతను పెంపొందించేందుకు బ్రహ్మకుమారీస్ అందిస్తున్న ఆధ్యాత్మిక సేవలు అభినందనీయమని చెప్పారు. నిశ్చలమైన మనశ్శాంతి ద్వారా ఆలోచనలు, కర్మలు శ్రేష్టంగా మారుతాయని, సైలెంట్ మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా ప్రతి మనసులో ప్రశాంతతను పెంపొందించేందుకు బ్రహ్మకుమారీస్ నిస్వార్థంగా ఉచిత సేవలు అందిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళలతో పాటు వివిధ వర్గాల వారికి దృఢమైన ఆధ్యాత్మిక నైతిక విలువల పునాదితో శాంతి పూర్వకమైన ఆదర్శ జీవన విధానాన్ని నేర్పేందుకు బ్రహ్మకుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్లు మానవ సేవకు అంకితం చేస్తున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని ముర్ము వివరించారు.

ఈ కేంద్రాన్ని సందర్శించే ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికత, ప్రశాంతత ద్వారా అంతరంగిక శక్తితో స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మలుచుకోగలదని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక సంపద వల్లే భారతదేశం విశ్వ గురువుగా ప్రపంచానికి వెలుగునిస్తూ.. మానవ జీవితానికి దిక్సూచిగా నిలుస్తోందని ముర్ము చెప్పారు.
కనీస అవసరాల్లో ముఖ్యమైనది మనశ్శాంతి.. గవర్నర్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము వర్చువల్ విధానంలో సైలెన్స్, రిట్రీట్ సెంటర్‌ని ప్రారంభించిన తర్వాత తమిళసై సౌందర రాజన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రానికి సమీపంలో ఉన్న సైలెన్స్ రిట్రీట్ సెంటర్ ప్రాంగణాన్ని రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంబిస్తున్న వేడుకల్లో తాను ప్రత్యేకంగా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రగతి వేగంగా జరుగుతున్నా మానసిక కాలుష్యం వల్ల అనారోగ్యకరమైన పరిణామాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆధ్యాత్మిక బలమే అన్ని పరిస్థితులకు తట్టుకునేలా వ్యక్తిని తీర్చిదిద్దుతుందని వివరించారు. బ్రహ్మకుమారీస్ నెలకొల్పిన సైలెన్స్ రిట్రీట్ సెంటర్ ఆధ్యాత్మిక కేంద్రం నైతిక విలువల శిక్షణతో ప్రజల జీవన విధానాన్ని అత్యుత్తమంగా మలచగలదని ఆకాంక్షించారు. ఈ కేంద్రం శాంతిని పంచే సేవలో తెలంగాణతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలిగించగలదని గవర్నర్ అభిలషించారు. సమాజంలో శాంతిని నెలకొల్పుతూ, అన్ని వర్గాల్లో సోదరభావాన్ని పెంపొందిస్తూ ద్వారా అంతర్జాతీయంగా బ్రహ్మకుమారీస్ 6 పీస్ మెసెంజర్స్ అవార్డులు పొందడం అభినందనీయమని తమిళిపై పేర్కొన్నారు.
రిట్రీట్ సెంటర్ క్యాంపస్‌ని సందర్శించిన గవర్నర్
కార్యక్రమ ప్రారంభానికి ముందు గవర్నర్ రిట్రీట్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన తపస్య ధామం, భాగ్యవిధాత భవన్, స్పిరిచ్యువల్ ఆర్ట్ గ్యాలరీలను సందర్శించారు. బ్రహ్మకుమారీస్ అంతర్జాతీయ ముఖ్య కేంద్రం మౌంట్ అబూ శాంతివనంలోని డైమండ్ హాల్ నుంచి రాష్ట్రపతి లాంచ్ చేసిన ‘రైడ్’ ప్రాజెక్ట్ రైజింగ్ ఇండియా త్రూ స్పిరిచ్యువల్ ఎంపవర్మెంట్ వివరాలను గవర్నర్ వర్చ్యువల్ గా వీక్షించారు.ఈ కార్యక్రమంలో
శాంతి రిట్రీట్ సెంటర్ డైరెక్టర్ బి.కె. ఆశా బీబ్, సైలెన్స్ రిట్రీట్ సెంటర్ డైరెక్టర్లు జి.కె. రాజుల్, స్థానిక సర్పంచ్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!