నకిలీ ఖాతాలలో జమ అయిన సొమ్ము తిరిగి వసూలు చేస్తాం.
జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.
సూర్యాపేట, ఫిబ్రవరి 9 (రోమింగ్ న్యూస్):
ధాన్యం కొనుగోలు అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా యస్.పి. రాజేంద్రప్రసాద్ తో కలసి ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా స్వతంత్ర దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో పోలీస్ శాఖ విచారణ నిర్వహిస్తుందని, విచారణకు వివిధ శాఖల అధికారులు సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే లింగాల, గడ్డిపల్లి ఐకేపీ కేంద్రాల నిర్వహకులపై కేసులు నమోదు చేశామని అలాగే ఆయా మిల్లుల యాజమాన్యులపై క్రినినల్ కేసులతో పాటు మిల్లుల ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగిందని తెలిపారు. జరిగిన అవకతవకలపై స్వతంత విచారణలో భాగంగా పోలీస్ శాఖ తో పాటు రెవెన్యూ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖలు విచారణ నిర్వహిస్తున్నా యని అన్నారు. లింగాల, గడ్డిపల్లి కేంద్రాల ద్వారా నకిలీ రైతుల ఖాతాలలో జమ అయిన సొమ్మును తిరిగి వసూలు చేయుటకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం ఇట్టి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని దోషులను గుర్తించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. డి.యం ఆఫీస్ లో ట్రాక్ చిట్స్ బుక్స్ జారీచేసిన హరీష్ ను ఉద్యోగం నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. అవకతవకలకు పాల్పడిన మిల్లలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందని అలాగే భవిష్యత్ లో సి.యం. ఆర్. ధాన్యం ఆయా మిల్లులు కేటాయించడం జరగదని కలెక్టర్ తెలిపారు.
దోషుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.
యస్.పి. రాజేంద్రప్రసాద్.
అనంతరం యస్. పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే ఎంకెఆర్ రైస్ మిల్లు, హనుమాన్ శివ సాయి మిల్లులు గడ్డి పల్లి యజమానులపై క్రినినల్ కేసులు నమోదుచేయడం తో పాటు విచారణ కొనసాగుతుందని, రెండు ఐకేపీ కేంద్రాల ద్వారా నకిలీ రైతుల ఖాతాలో వెళ్లిన సొమ్మును వసూలు చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో ఆత్మకూరు యస్ మండలం గట్టికల్లు, ముక్కుదేవుపల్లి ధాన్యం కొనుగోలు అవకతవకలలో విచారణను ఎదురుకోనున్న ధనలక్ష్మి రైస్ మిల్లు, లక్ష్మీ సహస్ర మిల్లు యజమానులను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు.