బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన చోటే తాము కూడా బహిరంగ సభ నిర్వహించి, బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాయంలో ఆయన మీడయాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు మానవత్వం లేదని, గురువులాంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్‌నే అవమానపరిచాడని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ఏనాడూ తెలంగాణ అమరవీరులకు జోహార్లు అనలేదని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ సంగతి చూస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలకు ఇష్టం లేకున్నా అందరినీ కలిసి, పిలిచి డబ్బుల సంచులిచ్చినా కేసీఆర్‌ను ఎవరూ పట్టించుకోలేదు ఎద్దేవా చేశారు.
రాజ్యాంగంలో ఒక్క పేజీని కూడా నువ్ టచ్ చేయలేవని కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ‘‘పిడికిలి లేని పార్టీ అన్నావ్ కదా.. నువ్వు బహిరంగ సభ పెట్టిన దగ్గరే మా నేతలతో చర్చించి పక్కాగా సభ పెడతాం.. మా దమ్ము చూపిస్తాం.. నువ్ మమ్మల్ని ఏమీ చేయలేవు. దమ్ముంటే తెలంగాణలో గన్ మెన్లను పక్కన పెట్టి తిరుగు.. తెలంగాణ ప్రజలే తరిమికొడతారు. జనగామలో సభ పెట్టి వారికోసం ఏం చేశావో కూడా చెప్పలేదు. నీ డౌన్ ఫాల్ అక్కడి నుంచే ప్రారంభం,’’ అని బండి సంజయ్ హెచ్చరించారు. అవినీతిని దాచుకునేందుకు కేసీఆర్ కూడా దేశం వదిలి వెళ్లాలని చూస్తున్నాడని, తెలంగాణ దాటనిచ్చేది లేదని అన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమని మరోసారి గుర్తుచేశారు