RN DAILY     G9 TELUGU TV    ePaper

రేవంత్ రెడ్డి అరెస్టును ఖండించిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క

ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కుతున్న సర్కార్

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (రోమింగ్ న్యూస్):

ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని ఆందోళనకు పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షులు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేయడాన్ని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. నిరసన వ్యక్తం చేయకుండా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థ ను కూనీ చేయడమే అని
మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయనిప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునివ్వడం కూడా తెలంగాణలో నేరం అయినట్టుగా కెసిఆర్ ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగించడం అప్రజాస్వామికమని అన్నారు.

రాష్ట్రంలో పోలీసులను పురిగొల్పి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ప్రతిపక్ష నాయకుల గొంతులను టిఆర్ఎస్ ప్రభుత్వం నొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేయడం రాజ్యాంగ కల్పించిన హక్కు అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కెసిఆర్ ప్రభుత్వం కాలరాస్తూ తెలంగాణలో
కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులను ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన కుండా
ప్రతి రోజు అరెస్టులు చేయడం ఏమిటని పోలీసులను నిలదీశారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత నిర్బంధ కాండ ఎప్పుడు లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ మేధావులు అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ఉద్యమాలను అణచి వేయడానికి ప్రభుత్వం ఇలాగే నిర్బంధం కొనసాగిస్తే కేసీఆర్ కు ప్రజల తిరుగుబాటు తప్పదు అని గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!