దేశమంతా తిరిగి మోదీ అవినీతిపై వివిధ భాషల్లో ప్రచారం చేస్తా
రాఫెల్ కుంభకోణం వెలుగు చూడాలి
కరెంటు మోటార్లు పెట్టి రైతుల అణచివేతకు కుట్ర
మీడియా సమావేశంలో కేసీఆర్ ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (రోమింగ్ న్యూస్):
దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ఈడీ, సీబీఐ కేసులు పెట్టి జైల్లో వేస్తామంటూ హెచ్చరిస్తున్నారని, జైలంటే దొంగలకు భయమని, తనకేం భయం లేదన్నారు. దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వాళ్లంతా ప్రధాని నరేంద్ర మోదీ దోస్తులేనని చెప్పారు. ఆదివారం ఆయన ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని చెప్పారు. ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్రికల్చర్ సెక్టార్‌లో మీటర్లు పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం ముసాయిదా ఇచ్చిందని తెలిపారు. దానికి తాను కూడా సమాధానం పంపానని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ఉత్తర్వులు పాటిస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే 25 వేల మీటర్లు పెట్టారని తెలిపారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి బీజేపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు చదువు వచ్చో రాదో తెలియడం లేదని కేసీఆర్ ఎద్దేవాచేశారు._
రఫేల్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని, కేంద్ర అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్నారు. మోదీవన్నీ గోల్ మాల్ మాటలేనన్నారు. రఫెల్ కుంభకోణం బయటికి రావాలని, అందులో దొంగలు బయటపడాలన్నారు. రఫెల్ పై మాట్లాడితే రాహుల్ ఎదురుదాడి చేశారని తెలిపారు.
ఎనిమిదేళ్లుగా ఎంతో శాంతంతో, సహనంతో ఉప్పెనలు, తుపానులెరుగని గంభీర సాగరం మాదిరిగా వున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ప్రభుత్వంపై వున్నట్టుండి ఎందుకు ఉగ్రరూపం ధరించారు? భారతీయ జనతా పార్టీ తీరుపైన, ప్రధాని మోడీ పాలనపైన ఇలా అవిశ్రాంతంగా విరుచుకుపడడానికి కారణాలేమిటి? ఇటీవలి ఆయన స్వర తీవ్రతను గమనిస్తున్నవారందరినీ ఈ ప్రశ్నలు వేధిస్తున్నాయి. ముఖ్యమంత్రి వాగ్ధాటి అప్పుడే సానబట్టిన సునిశిత ఖడ్గాన్ని కూడా తలదన్నుతున్నది. మాటొక్క తూటాలా పేలుతున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్ తన అస్త్రాలను నేరుగా ప్రధాని మోడీపైనే సంధిస్తున్నారు. ప్రజలు తనను దీవించి పంపిస్తే ఢిల్లీ కోటను బద్దలు కొడతానంటున్నారు.
మత పిచ్చితో దేశం సర్వనాశనం, కర్ణాటకను కాశ్మీరం చేశారు…మోడీని ఆ పీఠం మీది నుంచి తరిమి తరి మి కొడతామంటున్నారు. భారతీయ జనతా పార్టీ కరడుగట్టిన మతతత్వ పాలనతో దేశాన్ని సర్వనాశనం చేస్తోందన్నారు. పెట్టుబడులు భయపడి వెనుకకు మళ్లిపోయేలా చేస్తున్నారన్నారు. కర్నాటకలో ముస్లిం ఆడ పిల్లలపై రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని కాషాయ మూకలపై విరుచుకుపడ్డారు. బిజెపి పాలనలో దేశంలో పదిహేను, పదహారు లక్షల పరిశ్రమలు మూ తపడ్డాయని, నిరుద్యోగం తీవ్ర స్థాయిలో తాండవిస్తున్నదని విమర్శించారు.
దేశమంతా తిరిగి వివిధ భాషల్లో ప్రచారం చేస్తా
రైతుల పట్ల మోడీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. మరొక్క మెట్టు పైకి వెళ్లి ‘మీ అవినీతి చిట్టా నా దగ్గరుంది, దేశమంతా తిరిగి వివిధ భాషల్లో ప్రచారం చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రోద్యమ సమయంలో ఆంధ్ర వలస పాలకులపైన, కేంద్రంపైన ఆయన ఇంతగా భగ్గుమన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ ఈ విధంగా మూడో కన్ను విప్పిన శివుడిని తలపించలేదు. కేంద్రంపై ఇప్పుడిలా విరుచుకుపడడానికి ఒకే ఒక్క కారణం కనిపిస్తున్నది. ఆనాడు రాష్ట్ర అవతరణ కోసం నిప్పులు చెరిగిన కెసిఆర్ ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి, దేశ ఫెడరల్ నీతికి ఎదురవుతున్న చెప్పనలవికాని ముప్పును అడ్డుకోడానికి, చిన్న, సన్నకారు, మధ్య తరగతి రైతుల గడ్డ అయిన తెలంగాణను మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల కుట్రల నుంచి కాపాడడానికి అనివార్యమై అస్త్రశస్త్రాలను ధరించిన అసమానయోధుడి రూపమెత్తారని స్పష్టపడుతున్నది.
ప్రభుత్వరంగం అదానీ, అంబానీ పరం
మోడీ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ జోరు దేశ ప్రజలను చేత చిల్లిగవ్వ లేని నిరుపేదలుగా మార్చివేస్తున్న దృశ్యం అందరి కళ్లముందు వున్నదే. ప్రభుత్వ రంగాన్నంతటినీ గుజరాత్‌కు చెందిన అదానికో, అంబానికో అప్పనంగా అప్పగిస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర వున్న భారతీయ రైల్వేలను ముక్కలు చెక్కలుగా చేసి ప్రైవేటు యాజమాన్యాల జేబుల్లో కుక్కడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పేద, మధ్య తరగతి ప్రజానీకం భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఎల్‌ఐసి (జీవిత బీమా)ని ప్రైవేటుపరం చేయబోతున్నారు. వ్యవసాయం కార్పొరేట్ మయమైందన్నారు.పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడంటూ లేకుండా తుడిచిపెడుతున్న మోడీ ప్రభుత్వం గ్రామీణ జనాభాకు ప్రధాన ఉపాధి కల్పన రంగంగా వున్న వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యంలోకి పంపించడానికి చేసిన కుట్ర గా ఆయన అభిప్రాయపడ్డారు.
రైతులను కాల్చుకు తినడానికి సిద్ధంగా వున్న విద్యుత్తు సంస్కరణల బిల్లు పులిలా కోరలు చాచుకొని వున్నది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి సాధారణ రైతుల మూలుగులను పీల్చడానికి సిద్ధంగా వున్న ఈ సంస్కరణలను రాష్ట్రంలో అడుగు పెట్టనీయబోనని ముఖ్యమంత్రి ఒకటికి రెండు సార్లు శపథం పూని చెబుతున్నారు.
మోడీని సాగనంపితేనే దేశానికి మంచి రోజులు
దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గం.లు విదుత్తును ఉచితంగా ఇస్తున్న ఖ్యాతిని కెసిఆర్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఇంకో వైపు కాళేశ్వరం వంటి అనితర సాధ్యమైన మెగా ఇరిగేషన్ ప్రాజెక్టును అతి స్వల్ప కాలంలో నిర్మాణం పూర్తి చేసి రైతులకు పుష్కలంగా పంట నీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇందువల్ల వరిని పుష్కలంగా పండిస్తూ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా నిరూపించుకుంటున్నది. దీనిని ఓర్వలేక రాష్ట్ర రైతులు పండించే ధాన్య సేకరణను కేంద్రం మానుకున్నది. రైతు నోటి వద్ద ఆహారాన్ని హరించే అత్యంత నీచమైన పనికి ఒడిగడుతున్న ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే దేశానికి మంచి రోజులు వుండవని భావించిన కెసిఆర్ అందుకోసం ఉగ్ర నారసింహుడి రూపమెత్తడాన్ని ఏ విధంగా ఆక్షేపించగలం? నాడు రాష్ట్ర అవతరణ కోసం అపర రుద్రుడైన కెసిఆర్ నేడు దోపిడీ శక్తుల నుంచి కాపాడి దాని అభివృద్ధికి తన బాహువులను కవచాలుగా చేయడం కోసం కేంద్రంపై నిప్పులు కురుస్తున్నారు. ప్రజల ఆశీస్సులు ఈ లక్ష్యంతో ఆయన తప్పని సరిగా విజయం సాధిస్తామన్నారు.
రాఫెల్ కుంభకోణం బయటకు రావాలి..
అందులో దొంగలు బయటపడాలి.. రాఫెల్‌పై రాహుల్ మాట్లాడితే ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని సీఎం అన్నారు.