ములుగు, ఫిబ్రవరి 13 (రోమింగ్ న్యూస్) : మేడారం జాతరకు తొమ్మిది వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఆదివారం డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. 400 సీసీ కెమెరాలతో నిత్యం నిఘా పెడుతున్నట్టు ఆయన తెలిపారు. క్రౌడ్ కంట్రోల్ నియంత్రణకు 33 డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 33 చోట్ల పార్కింగ్ స్థలాన్ని పోలీస్ శాఖ ఏర్పాటు చేసిందని, 37 చోట్ల పార్కింగ్ హోల్డింగ్ పాయింట్లు, ప్రతి రెండు కిలోమీటర్లకు పోలీసు అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 50 చోట్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లతో పాటు జాతర ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద అధునాతన రీతిలో భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ జామ్ కాకుండా నిత్యం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రోడ్డు మార్గం ద్వారా జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే 13వ తేదీ నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందిస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే.