కోలాటాలు…నృత్యాలతో భక్తుల హంగామా
భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు
యాదాద్రి, ఫిబ్రవరి 15 (రోమింగ్ న్యూస్):
యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమానం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ అమ్మవారిని 33 కోట్ల దేవతల సాక్షిగా వివాహమాడిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దివ్య విమాన రథంపై అధిష్టించి ఊరేగింపును ఆలయ అర్చకులు దేవస్థానం అధికారులు సిబ్బంది పోలీసుల బందోబస్తు మధ్య ఘనంగా జరిపారు. ఎదురులేని దొరను ఎదురేగి పిలిచేము… అంటూ కళ్యాణ మూర్తులు రథంలో తరలి వస్తుండగా భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు.
అంతకుముందు రథం వద్ద కుంకుమతో కలిపిన అన్నంతో బలిహరణం చేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను మల్లె, మందార, పున్నాగ, జాజి, చేమ, చంపక వంటి పుష్పాలతో… చంద్రహారం, ముత్యాలు, మువ్వలు, పగడాలు, వివిధ రకాల కంఠాభరణాలతో అలంకరించారు. రథంలోని పరమాత్ముడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. రథం ఒక శరీరం.. ఆ రథంలోని 24 అరలు మన ఇంద్రియాలు వంటివని రథంలో స్వామి అమ్మవార్లను అధిష్టించిన మన హృదయం ఒక అర వంటిదని ఆ భగవంతున్ని భగవంతుని మనసులో ఉంచుకొని ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే భగవంతుడు మనకు దర్శనం అవుతారని పురాణాలు చెబుతున్నాయని ఆలయ అర్చకులు రథోత్సవం సందర్భంగా భక్తులకు వినిపించారు. సోమవారం రాత్రి శ్రీలక్ష్మీ అమ్మవారితో వివాహం చేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహుడు అమ్మ వారితో కలిసి తిరువీధులలో ఊరేగుతూ మంగళవారం రాత్రి భక్తులకు దర్శనమివ్వడం అంటే వివాహం తర్వాత జరిగే బరాత్ వేడుకను రథోత్సవంగా భక్తజనం కోసం దేవస్థానం వారు నిర్వహిస్తుంటారు. యాదగిరి వాసా గోవిందా… గోవిందా అంటూ భక్తులు జయ జయ ద్వానాలు చేశారు…
రథోత్సవంలో ఆనంద పరవశులైన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహుని కొలుస్తూ ముందుకు సాగారు. నరసింహుదీని దర్శించుకుని భక్తులు ఆనంద తన్మయులయ్యారు. రంగురంగుల పుష్పాలు..అర్చకుల పారాయణాలు… విద్యుత్ దీపాల వెలుగులో రథోత్సవం జరిగింది. రథం పైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని అధిష్టింప చేయగానే శ్రీలక్ష్మీనరసింహ గోవిందా గోవిందా నామస్మరణలతో పాతగుట్ట పరిసరాలు మారుమ్రోగి పోయాయి. విశ్వశాంతి లోకకల్యాణార్థం కోసం లక్ష్మీనరసింహుడు జరుపుకునే రథోత్సవంలో భక్తులు దర్శించుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తులు కోలాతాలు, నృత్యాలు చేశారు.
రథం ఎదుట రథంగా హోమం…!!
పాతగుట్ట ఆలయంలో నిత్య ఆరాధనల నిర్వహించిన మీదట మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు రథంగా హోమము జరిపారు.అర్చకులు రథబలిని నిర్వహించారు. శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను దివ్య విమానం రథంపై వేంచేపు చేసి రథంపై ఆరాధన గావించారు. భక్తుల దర్శనార్థం శ్రీ స్వామివారు…అమ్మవారిని దివ్యభరనాలతో అలంకరణ చేసి రథంపై అధిష్టించిన మీదట ఊరేగింపు సేవలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఏఈఓలు రమేష్ బాబు, దోర్బల శ్రీధర్ శర్మ, గజ్వేల్ రఘు, పలువురు సూపరిండెంట్ లు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. యాదగిరిగుట్ట సీఐలు జానకి రెడ్డి, నవీన్ రెడ్డిలు బందోబస్తును పర్యవేక్షించారు.