మేడారములో పోటెత్తిన భక్త్తులు
భక్తి పారవశ్యంలో ఊగిపోతున్న మేడారం
మేడారం, ఫిబ్రవరి 16 (రోమింగ్ న్యూస్):
మేడారం మహాజాతర ప్రారంభ ఘట్టానికి సర్వం సిద్ధమైంది. బుధవారం రాత్రి11 గంటల సమయంలో సారలమ్మ గద్దెపైకి చేరుకున్నారు. జాతరలో భాగంగా కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం బయల్దేరి డప్పు వాయిద్యాల నడుమ గిరిజన సంప్రదాయ పద్ధతిలో సారలమ్మను ఊరేగింపుగా గిరిజన పూజారులు తీసుకువచ్చారు.
మేడారానికి సుమారు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం నుంచి అమ్మవారిని ఊరేగింపుగా మేడారం తీసుకువచ్చి జంపన్న వాగు మీదుగా రాత్రి 11 గంటల ప్రాంతంలో గద్దెలపై సారలమ్మను ప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే సీతక్క దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేశారు.
వేలాది మంది పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును పర్యవేక్షించారు. లక్షలాదిమంది భక్తులు సారలమ్మ గద్దెనెక్కిన సందర్భంగా తరలివచ్చారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు గద్దెనెక్కిన సారలమ్మను దర్శించుకున్నారు.