ఒక స్వాములోరు భారీ స్థాయిలో ఒక యాగం చేస్తున్నారనుకోండి. దానికి ఒక ముఖ్యమంత్రి వచ్చి.. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? అని అడగటం ఉంటుందా? అంటే లేదని చెబుతారు. కానీ.. అలాంటి అభిప్రాయం ఉంటే తక్షణం మార్చుకోవాల్సిందే. ఎందుకంటే.. మిగిలిన స్వాములోళ్ల సంగతులు ఎలా ఉన్నా.. చినజీయర్ స్వామి మాత్రం వారికి పూర్తి మినహాయింపుగా చెప్పాలి. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శంషాబాద్ కు కాస్త దగ్గర్లోని ముచ్చింతల్ లో ఉన్న చినజీయర్ ఆశ్రమంలో ఫిబ్రవరి 2 నుంచి సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. 43 ఎకరాల్లో 1000 కోట్లతో నిర్మిస్తున్న దివ్య క్షేత్రాన్ని ఆరేళ్లలో నిర్మించనున్నారు. 216 అడగులు ఎత్తులో రామానుజుల పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమంలో భాగంగా భారీ యాగాన్ని చేస్తున్నారు. ఈ విగ్రహం బరువు 1800 కేజీలు కాగా.. సమతా మూర్తి చుట్టూ 108 ఆలయాలు ఏర్పాటు చేసి.. మధ్యలో భారీగా మండపాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు అంటే 12 రోజుల పాటు భారీ స్థాయిలో ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 120 యాగశాలలు.. 1035 హోమగుండాలు.. 5 వేల మంది రుత్వికులు వస్తున్నారు. వారి భోజనాలతో పాటు ఈ యాగాన్ని చూసేందుకు వేలాదిగా ప్రజలు వస్తున్నారు. ఈ యాగం కోసం ఏకంగా 2 లక్షల కేజీల ఆవునెయ్యిని వినియోగిస్తున్నారంటే.. ఈ యాగం సైజు ఎంత పెద్దదన్న విషయం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ యాగాన్ని నిర్వహిస్తున్న చిన జీయర్ స్వామికి అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి సమీక్షించటం కోసం రెండు.. మూడు వారాల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆశ్రమానికి వెళ్లటమే కాదు.. అక్కడ నుంచి విద్యుత్ శాఖ పెద్దాయనకు ఫోన్ చేసి.. ఆగమేఘాల మీద ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పినట్లుగా చెబుతారు. అంతేకాదు.. ఈ ప్రాంతానికి అవసరమైన నీటి కోసం వాటర్ బోర్డును ప్రత్యేకంగా లైన్ వేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న యాగ ఏర్పాట్ల గురించి స్థానికంగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రావటం.. మాట్లాడటం వరకు ఓకే.
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రావటం.. స్వామి వారితో యాగ ఏర్పాట్లు.. పనుల గురించి మాట్లాడి.. సహాయ సహకారాల గురించి అడిగినట్లుగా చెబుతున్నారు. ఈ యాగానికి ఒక రోజు రాష్ట్రపతి.. మరోరోజు ప్రధానమంత్రి వస్తారన్న అంచనా ఉంది. ఏమైనా.. ఒక స్వాములోరు చేసే యాగానికి ముఖ్యమంత్రులే స్వయంగా ఆశ్రమానికి వెళ్లి మరీ.. పనుల గురించి తెలుసుకోవటం చూస్తే.. చినజీయర్ స్వామి స్థాయి ఏమిటో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.