



కల్యాణం నేటి రాత్రి 8 గంటలుగా ఖరారు
శ్రీవారికి వరపూజ…అమ్మవారికి పూలు పండ్లు
యాదాద్రి, ఫిబ్రవరి 13 (రోమింగ్ న్యూస్):
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పాతగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ నిశ్చయ తాంబూలాలతో ఒప్పందం కుదిర్చారు. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు కళ్యాణ సుముహూర్త ఘడియలుగా నిర్ణయించారు. ఎదుర్కోలు మహోత్సవం అంటే జగద్రక్షకుడు అయిన శ్రీలక్ష్మీ నృహరి కళ్యాణ ఘడియలు ఖరారు చేయడమే…!
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి వరపూజ, వధువు శ్రీలక్ష్మీదేవికి పూలు పండ్లు కార్యక్రమం కన్నుల పండువగా అర్చక బృందం జరిపారు. ఎదుర్కోలు మహోత్సవాన్ని భక్తులు కన్నులపండువగా దర్శించి తరించారు. ఎదుర్కోలు మహోత్సవములో శ్రీవారి అమ్మవారి గుణగణములను అర్చకులు వర్ణించారు. జీవకోటిని ఉద్ధరించేందుకు శ్రీవారు అశ్వ వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
ఎదుర్కోలు వైభవం
ఎదుర్కోలు మహోత్సవం రాత్రి 8 గంటల సమయంలో మొదలైంది. పట్టు వస్త్రాల అలంకరణతో అశ్వ వాహనసేవపై శ్రీనరసింహుడు, ముత్యాల పల్లకీ ద్వారా లక్ష్మీదేవి ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరారు. మేళతాళాల నడుమ ప్రధాన మండపానికి చేరారు. ఎదురెదురుగా స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేసి శ్రీవారి వైపు ఆలయ ఈవో ఎన్. గీత అమ్మవారి వైపు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ప్రధాన అర్చకులు ఎం మోహనా చార్యులు, ఉప ప్రధానార్చకులు రంగాచార్యులు వైష్ణవ సంప్రదాయ రీతిలో సంబంధం ఖాయమైన కార్యక్రమాన్ని జరిపారు. అర్చక స్వాములు వేద పండితులు తదితరులు కలిసి కళ్యాణ ఒప్పందాన్ని ఖాయం చేశారు.


ఎదుర్కోలు విశిష్టత
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం ఎంతో విశిష్టమైనది అమ్మవారిని, స్వామివారిని కళ్యాణమూర్తులుగా అలంకరణ చేసి పల్లకీలో తీసుకువచ్చారు.ఆస్థాన మండపములో ఎదుర్కోలు నిర్వహించారు.ఎదుర్కోలు వేడుకలు జీవకోటి ప్రతినిధిగా…శ్రీ స్వామి వారిని పరమాత్మ ప్రతినిధిగా భావన చేసి భాగవానుడుని జీవుడు చేరడం చాలా కష్టం కాబట్టీ అమ్మవారి ద్వారా శ్రీవారిని చేరడం సులభమని ఆళ్వార్లు, ఆచార్య పురుషులు అమ్మవారిని స్తుతించారు.”అమ్మా నీవు ఎక్కడో క్షీర సముద్రంలో సుఖంగా ఉంటావు లేదా శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి నిత్య నపాయనివిగా ఉంటావు…కానీ జీవకోటిని అనుగ్రహిపజేస్తూ జీవులను రక్షించమని వేడుకున్నారు”
శ్రీవారిని పరమాత్మ తత్వం గా భావించి నిత్యులు, ముక్తులు పరమపదంలో సేవిస్తారు. సర్వ దివ్య మంగలదివ్య సౌందర్యాన్ని, దయా గుణాన్ని జీవ కోటికి అందజేసేందుకు గాను విష్ణు వక్షస్థల స్థిత అయిన అమ్మవారు భగ్వఅనుడికి తమ ఆర్తిని వినిపిస్తూ నిత్యం అనపాయినిగా ఉంటుంది. జగద్రక్షకుడైన భగవానుడు శ్రీదేవి చేసే పురుషాకారానికి సంతసిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. కల్యాణ మహోత్సవం నిర్వహణతో జీవ కోటిని, ప్రకృతిని ఆనందింపజేయడానికి భగవంతుడి అనుగ్రహంగా ఈ వేడుకలు నిర్వహిస్తారని ప్రధాన అర్చకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దోర్బల భాస్కర్, పర్యవేక్షకులు గజ్వేల్ రఘు, సార నరసింహ తదితరులు పాల్గొన్నారు.
