డోలీలో స్వామి సన్నిధికి చేరుకున్న మెగాస్టార్
శబరిమల, ఫిబ్రవరి 13:
మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఆదివారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత శబరిమల స్వామిని దర్శించుకున్నానంటూ ట్విట్టర్‌లో శబరిమల యాత్రకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకున్నారు. ‘చాలాకాలం తర్వాత శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాను. అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా కాలి నడకన కాకుండా డోలీలో స్వామి సన్నిధికి చేరుకోవాల్సి వచ్చింది. స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమను ధారపోస్తున్న డోలీ సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో చుక్కపల్లి సురేశ్, గోపీ కుటుంబాల తోడు మంచి అనుభూతినిచ్చింది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు మెగాస్టార్.
డోలీ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు..
మాస పూజ సందర్భంగా శనివారం సాయంత్రం అయ్యప్ప స్వామి దేవస్థానం తెరిచారు. ఈ నెల 17 వరకూ దేవాలయం తెరచి ఉంచుతారు. కాగా ఎన్నో ఏళ్లగా చిరంజీవి అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కుమారుడు రామ్‌చరణ్ కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నారు. అయితే మండల పూజ, మకరజ్యోతి సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కుదరకపోవడంతోనే ఇప్పుడు చిరంజీవి దంపతులు శబరిమల యాత్రకు వెళ్లారు. కాగా డోలీలో శబరికొండకు చేర్చిన డోలీ కార్మికులకు మెగాస్టార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారితో కాసేపు ముచ్చటించారు