RN DAILY     G9 TELUGU TV    ePaper

28న నిజ దర్శనాలు షురూ…

కొండ కింద బదులు బాలాలయములో యాగం

ఐదు కుండాలతో సుదర్శన నారసింహ యాగం నిర్వహణ

కొండ కింద యాగం లేదనడముతో మీడియాలో విశేష ప్రచారం

యాదాద్రి, ఫిబ్రవరి 19 (రోమింగ్ న్యూస్):

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి మూలవర్యుల నిజ దర్శనాలకు అవసరమైన అన్ని కార్యమాలు జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి,వైటీడీఏ చైర్మన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైటీడీఏ, దేవాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానాలయములో నిజ దర్శనాలు మొదలుకావడానికి అవసరమైన అన్ని పనులు పూర్తవుతున్నట్లు శనివారం రాత్రి రోమింగ్ న్యూస్ ప్రతినిధితో అధికారులు స్పష్టం చేశారు…యాగంపైన కూడా స్పష్టత వచ్చిందని ఈఓ గీత చెప్పారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ప్రధానాలయ దర్శనాలు మార్చి 28 నుంచి ప్రారంభించేందుకు అవసరమైన కసరత్తు నిర్వహిస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో తెలిపారు.

కొండ కింద నిర్వహించ తలపెట్టిన సుదర్శన మహా యాగము మాత్రమే వాయిదా పడిందని ఆమె స్పష్టం చేశారు. బాలాలయములో సుదర్శన నారసింహ యాగాన్ని ఐదుయజ్ఞ కుండాలతో నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.1008 కుండాలకు బదులుగా బాలాలయములో ఐదు కుండాలతో యాగం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే అర్చకులు మూలమంత్ర జప పారాయణాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. స్థానిక దేవాలయ అర్చకులు అంతరంగికంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చకచకా సాగిపోతున్నాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా 75 ఎకరాలలో యాగ మండపం నిర్మాణం చేసి ఎవరూ నిర్వహించని విధంగా శ్రీ సుదర్శన నరసింహ మహా యాగం చేపట్టాలని భావించారు. అయితే యాగ నిర్వహణ విషయంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామితో ఏర్పడ్డ విభేదాల కారణంగానే కొండ కింద యాగము రద్దయిందని మీడియాలో విశేష ప్రచారం జరుగుతోంది. అందువల్లనే కోట్ల రూపాయలు వెచ్చించి నిర్వహించాలనుకున్న సుదర్శన మహా యాగం నిర్వహణ చర్చనీయాంశం అయిపోయింది.

గత ఆరు సంవత్సరాలుగా శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యాదాద్రిలో దేవాలయ నిర్మాణం జరగడానికి సహకరిస్తూ వస్తున్న చిన్న జీయర్ యాగ నిర్వహణ విషయంలో సీఎంకు అభిప్రాయ భేదాలు రావడంతో కొండకింద యాగ నిర్వహణ రద్దయిపోయిందని ప్రచారం ఊపందుకుంది.

మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి 21న అంకురార్పణ

మార్చి 21 నుంచి 28 వరకు జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ బాలాలయములో జరుగుతాయని స్పష్టత వచ్చింది. చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతల్ లో జరిగిన యాగ నిర్వహణ మాదిరిగా యాదాద్రి లో కూడా అందరూ చర్చించుకునే స్థాయిలో జరుగుతుందని సీఎం కేసీఆర్ రెండు నెలల క్రితం ప్రకటించినప్పటి నుంచి మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సమయం దగ్గర పడిన తరువాత ఏర్పాట్లు పూర్తి కాలేదన్న కారణం చెప్పి యాగాన్ని వాయిదా వేయడం అందరి నోట చర్చనీయాంశమైంది…సీఎం కేసీఆర్ సహస్రాబ్ది ఉత్స వాలకు వెళ్లకపోవడం… మేడారం పర్యటన రద్దు చేసుకోవడం చూస్తే కేసిఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టిసారించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఎనిమిది రోజులపాటు ఎవరూ ఊహించని విధంగా ఈ యాగం నిర్వహిస్తామని కొండ కింద గండి చెరువు వద్ద ఎవరూ ఊహించని విధంగా జరుగుతుందని ఆశ పడిన వారు కొండ కింద యాగం లేదని అధికారులు చేసిన ప్రకటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

యాగశాల నిర్వహణ కోసం …నిర్మాణం కోసం భూమిని చదును కూడా చేయించారు ఎత్తు పల్లాలను సరి చేయించారు …దీనిపై విస్తృత స్థాయి సమీక్షలు కూడా జరిగాయి. సుదర్శన యాగం లో 1008 యజ్ఞ కుండాలు… 6 వేల మంది ఋత్వికులు, మరో మూడు వేలమంది సహాయకులు భాగస్వాములు అవుతారని అధికారులు గతంలో ప్రకటించారు. యాగ నిర్వహణకు అవసరమైన హోమ ద్రవ్యాల కొనుగోలు కోసం సీఎం కేసీఆర్ 75 కోట్లు కూడా విడుదల చేసి పనులను చేపట్టారు.పూజా ద్రవ్యాలు, నెయ్యి సేకరణ టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇంత జరిగాక ఇక ఇప్పుడు కార్యక్రమం వాయిదా పడటం తీవ్ర అనుమానాలకు కారణమవుతున్నది. ఆదివారం సీఎం ముంబై వెళ్లి ఉద్ధవ్ థాకరే ను కలువనున్నారు. అనంతరం ఎన్సీపీ నేత శరద్ పవార్ తో సమావేశం అవుతారు…ఇలా క్షణం తీరిక లేకుండా జాతీయ రాజకీయాల్లో పాల్గొనాల్సి ఉన్నందున యాదాద్రిలో చేపట్టాలని నిర్ణయించిన అతిపెద్ద కార్యక్రమం గురించి ఇప్పుడు రచ్చ మొదలైంది. రాజకీయ పరిశీలకులు, ఆధ్యాత్మివేత్తల మధ్య వేడి వేడి చర్చలకు యాదాద్రి వేదిక మారిందని వారు అభిప్రాయపడుతున్నారు.
యాగం రద్దయినప్పటికి మార్చి నెల 28 నుంచి దర్శనాల కార్యక్రమం సాఫీగా సాగిపోతుందని అధికారులు చెబుతున్నారు.

వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ

యాగంతో సంబంధం లేకుండా ప్రధానాలయ మూలవర్యుల దర్శనాలకు సంబంధించిన మహాకుంభ సంప్రోక్షణ వైభవంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు దేవస్థానం కార్యనిర్వహణాధికారి గీత తో పాటుగా సివిల్ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనుల నిర్వహణ కోసం కసరత్తు చేశారు. వై టి డి ఎ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కొండపైన పర్యటించి చేపట్టాల్సిన పనులను గురించి చర్చించారు. పనులు నిర్వహిస్తున్న సాయి పావని యాజమాన్యంతో పాటు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

బంగారు తాపడం పనులు వేగిరం

విమాన గోపురానికి బంగారు తాపడం చేయాల్సిన పనులు వేగిరం అయ్యాయి. ఇప్పటికీ యాదాద్రి భక్తులు నగదు బంగారం విరాళంగా ఇస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. కొండపైన నిర్మాణం జరుపుకున్న ఏడు గోపురాలపై కలశాలకు బంగారు తాపడం చేసేందుకు ఉద్దేశించిన పనులను సమీక్షించారు. మార్చి 21లోగానే ఇవి పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!