

తొలి రోజు విశ్వక్సేన ఆరాధన…స్వస్తి వాచనము
అంకురారోహణము…
మృత్స్యంగ్రహణం
యాదాద్రికి ఉత్సవ శోభ
విజయవంతమైన వైద్య శిబిరం
యాదాద్రి, మార్చి 4 (రోమింగ్ న్యూస్):
యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల సంరంభం శుక్రవారం ప్రారంభమైంది. వేదమంత్రాల ఘోషలో స్వస్తీ వాచనము నిర్వహించారు. వేదపండితులు… అర్చకులు…పారాయనీకుల మంత్ర ఘోషలో యాదాద్రి తిరువీధులు ప్రతిధ్వనిస్తూ ఉండగా… యాదగిరి నరసన్న జాతరకు వేద పండితులు అధికారులకు కంకణ ధారణ చేశారు. బాలాలయంలో నిత్య ఆరాధనలు విశ్వక్సేనారాధన, రక్షాబంధనం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. విశ్వక్సేనా రాధనతో లోకాలకు శుభం కలిగించాలని వేడుకుంటూ విశ్వక్సేన ఆరాధన జరిపారు. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగడం కోసం శ్రీ మహావిష్ణువు సైన్యాధ్యక్షుడు అయినా విశ్వక్సేనుని ఆహ్వానిస్తూ పూజలు చేశారు.


విశ్వక్సేనుని ఆరాధన ద్వారా సర్వవిధ ఆటంకాలు తొలగిపోతాయని ఉత్సవం నిర్విఘ్నంగా కొనసాగుతుందని భగవంతుని అనుగ్రహం భక్తులకు కలుగుతుంది. స్వస్తి వాచనం నిర్వహించడం శ్రీ వైష్ణవ సంప్రదాయం పాటించే ఆలయాలకు తప్పనిసరి. ఈ ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించే వేళలో ఆగమ శాస్త్రానుసారంగా స్వస్తివాచనముతో వైదిక కార్యక్రమాలను ప్రారంభించడం పరిపాటి. స్వస్తి వాచన మంత్రములతో విశ్వశాంతి లోక కళ్యాణం కలిగించమని ప్రాణికోటికి ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించే విధంగా ఆశీర్వదించమని భగవంతుని వేడు కొనడమే స్వస్తి వాచకం. స్వస్తి వాచన మంత్రములను ఆలయ పరిసర ప్రాంతాలలో భక్త జనుల పై ప్రోక్షణ గావించారు.
రక్షాబంధనము
ఉత్సవమూర్తులకు ఆగమ శాస్త్రానుసారంగా రక్షాబంధన వేడుక నిర్వహించారు. ఈ వేడుక ద్వారా జగద్రక్షకుడైన పరమాత్మ లోకకల్యాణార్థం ఆగమ శాస్త్రానుసారంగా సమర్పించబడిన రక్షాబంధనమును స్వీకరిస్తారు. శ్రీవారికి అమ్మవారికి సమర్పించిన అనంతరం ఉత్సవ నిర్వహకులు ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బీ. నరసింహమూర్తి, ఈ ఈఓ గజ్వేల్లి రమేశ్ బాబు, దోర్భల భాస్కర్ శర్మ ఇతర ఉద్యోగులు, సిబ్బందికి కంకణధారణ చేశారు. అధికారులు రక్షాబంధనం ధరించి భక్తిశ్రద్ధలతో దీక్షా పరులై
స్వామివారి సేవలో పాల్గొనడమే రక్షాబంధనము ప్రత్యేకత.


ఒక్క మాటలో చెప్పాలంటే లోకకల్యాణార్థం కళ్యానోత్సవాలు జరుపుకుంటున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతామని అధికారులు కంకణధారణ కావడమే రక్షాబంధనం.
అంకురార్పణ
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. శుక్రవారం రాత్రి మృత్యం గ్రహణము… అంకురార్పణ కార్యక్రమాలను ఉప ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మృత్యం గ్రహణము నిర్వహించడం అంటే పుట్ట మన్ను తెచ్చి అంకురార్పణ చేయడమే. పుట్ట వద్ద భగవంతుడిని ఆరాధించి విశ్వక్సేనాదులతో కలిసి పుట్టమన్నును సేకరించారు. దాన్ని వేదమంత్రాల నడుమ యాగశాలకు చేర్చారు. అనంతరం పుట్టమన్నుకు మంత్ర జలంతో సంప్రోక్షణ గావించారు. పాలికలలో నవధాన్యములను పుట్టమన్నుతో కలిపి నింపి ఆరాధన గావించారు. పాలికలను ఉత్సవములు ముగిసేంత వరకు ప్రతిరోజు ఆరాధన చేస్తారు. తద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది.


విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం తులసీవనములో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. హైదరాబాదులోని ఏ.ఎస్.రావు నగర్ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలకు చెందిన డాక్టర్ సిహెచ్ విజయ్ పాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి వైద్య చికిత్సలు పొందారు. ఈ సందర్భంగా వారికి మందులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట వైద్యాధికారి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


