RN DAILY     G9 TELUGU TV    ePaper

గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ ప్రత్యేక కథనం

28న యాదాద్రి కి రానున్న సీఎం కేసీఆర్

28న ప్రధానాలయంలో
మహాకుంభ సంప్రోక్షణ

భక్తులకు నిరంతర అన్నదానం

యాదాద్రి లో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు

ఏర్పాట్లపై ప్రత్యక్ష పరిశీలన చేసిన ఉన్నతాధికారులు

యాదాద్రి,మార్చి 20 (రోమింగ్‌ న్యూస్‌):
మహిమాన్వితమైన యాదాద్రి మహా పుణ్యక్షేత్రంలో నిజ దర్శనాల కోసం వారం రోజుల పాటు జరుగనున్న సంరంభం నేటి నుంచి మొదలవుతుంది. విష్వక్సేన పూజ నిర్వహించి స్వస్తీవాచనము జరపడంతో పంచకుండాత్మక శ్రీసదర్శన నారసింహ మహాయాగానికి అర్చకులు శ్రీకారం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక సూచనలపై ఆదివారం సాయంత్రం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం మూడు గంటల పాటు ఏర్పాట్లు ఎలా చేసారు… ఇంకా ఎలా చేయాలనే విషయాలు చర్చించారు.

యాదాద్రి ఈఓ గీత, సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డి తో కలిసి వారు సమీక్షించారు. సీఎఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు నర్సింగరావు, శాంతికుమారి, సునీల్ శర్మ, రామకృష్ణా రావు, యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు యాదాద్రి లో పర్యటించారు. టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్, తులసి వనం, గండి చెరువు వద్ద నిర్మాణం జరుపుకుంటున్న పుష్కరిణీ లను సందర్శించారు. కొత్తగా నిర్మాణం జరుపుకుంటున్న బస్ స్టేషన్, సత్యనారాయణ వ్రత మండపాలను కూడా వారు పరిశీలించారు. రాత్రి భోజనాలు ప్రెసిడెన్షియల్ షూట్లో ముగించారు. భువనగిరి ఆర్.డీ.ఓ భూపాల్ రెడ్డి,గుట్ట తహసీల్దార్ రాము తదితరులు వారి వెంట ఉన్నారు.

భక్త వరప్రదుడు… శ్రీలక్ష్మీనరసింహుడు

భక్త వరప్రదుడు… తన భక్తులకు సదాచార సంపదలను సమృద్ధిగా వర్షిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు యాదాద్రిలో కొలువుదీరి భక్తులను కరుణిస్తున్నారు.
కోట్లాది మంది భక్తులకు ఇలవేల్పుగా యాదాద్రిలో కొలువుదీరి కోరిన కోర్కెలు తీరుస్తున్నారు. మహిమాన్విత క్షేత్రంగా యాదాద్రి విలసిల్లుతున్నది… ఆపదలో శరణు కోరిన వారిని రక్షిస్తూ ఆర్తత్రాణ పరాయణునిగా పేరు గడించారు…. అలాంటి మహిమాన్విత యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం తర్వాత నిజ దర్శనాల కోసం పంచకుండాత్మక యాగం….మహాకుంభ సంప్రోక్షణలకు వేదిక అవుతున్నది. వేలాది మంది భక్తులు యాదాద్రి కి తరలివస్తారని అధికారులు అంచనావేస్తున్నారు.
2014 అక్టోబర్ 17న యాదాద్రికి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి వచ్చిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన యాదాద్రి అభివృద్ధికి శ్రీకారం పలుకుతున్నట్లు అభివృద్ధి చర్యలు పర్యవేక్షించేందుకు వైటీడీఏ ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో మొదలైన అభివృద్ధి పనులు నేటి వరకు కొనసాగుతూ వస్తున్నాయి. వైటీడీఏ వైస్ చైర్మన్ గా జి కిషన్ రావు చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. యాదాద్రి ఈవో గీత అన్నీ తానై అభివృద్ధి పనులలో సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తూ తన శైలిని కాపాడుకుంటూ అభివృద్ధి కోసం ముందుకు సాగిపోయారు. ఫలితంగా నేటి నిదర్శనాలు సమారోహం అంగరంగ వైభవంగా శ్రీలక్ష్మీ నరసింహుని భక్తులు మురిసి పోయే విధంగా జరగడం విశేషం. తానేమిటో నిరూపించుకునేందుకు అవతరించిన శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం భక్తులను కరుణిస్తూ అక్కున చేర్చుకుంటూ ఆర్తత్రాణ పారాయణుడిగా భక్తులచే పూజలందుకుంటున్నాడు.

నేటి నుంచి…పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం

కేసీఆర్ ముందస్తుగా చెప్పిన పద్దతిలో కాకుండా పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 21న ఉదయం 9 గంటలకు విశ్వక్సేనుడికి తొలిపూజ, స్వస్తిపుణ్యాహ వాచన మంత్ర పఠనాలతో స్వయంభు పంచనారసింహుడి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ పర్వాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉద్ఘాటన పర్వాలు 28న మధ్యాహ్నం 11.55 గంటలకు మిథున లగ్నం సుముహూర్తంలో మహాకుంభాభిషేకం, సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణంతో ముగియనున్నాయి. అనంతరం సామాన్య భక్తులకు గర్భాలయంలో కొలువుదీరిన పాంచనారసింహుల దర్శనాలు కల్పించనున్నారు. ప్రధానాలయ పనులు పూర్తికావడంతో ప్రభుత్వం మహాకుంభ సంప్రోక్షణ తేదీని ఖరారు చేసింది. ఉద్ఘాటన పర్వాలు ఈనెల 21 నుంచి పాంచరాత్రాగమ శాస్త్ర పద్దతిలో జరగనున్నాయి. ఆలయ ఉద్ఘాటనకు రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏర్పాట్ల పూర్తి చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. బాలాలయ గడపలోనే ఉద్ఘాటన వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు.. ఇందు కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. దీంతో బాలాలయంలో భక్తులు నిర్వహించుకునే మొక్కు పూజలు, శాశ్వత సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలు, కల్యాణాలు, వెండిజోడుసేవలను బుధవారం నుంచి రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం నిర్వహించిన ఆర్జిత సేవలే బాలాలయంలో చివరివి అయ్యాయి.

మిధున లగ్నంలో మహాకుంభ సంప్రోక్షణ కాగానే దర్శనాలు

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 11గంటల55 నిమిషాలకు మహకుంభ సంప్రోక్షణ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని ఈఓ తెలిపారు. మార్చి 21వ తేదీ నుంచి 7 రోజుల పాటు బాలాల యంలో పంచకుండాత్మక యాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువు జరుగుతుందన్నారు. ఆలయ గోపురాల కలశాలన్నింటికీ
సంప్రోక్షణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 21 నుంచి 28 వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 28న సంప్రోక్షణ అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయం లోకి తరలిస్తామన్నారు. అన్ని పూజలు పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తామని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇదిలావుంటే యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. ఈ నెల 21 నుంచి ఉద్ఘాటన కార్యక్రమాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గుట్ట ఈవో గీతారెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో పనుల ఏర్పాట్లపై సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించనున్న ఆలయ మహాకుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక యాగం, హోమాలపై చర్చించారు. ఉద్ఘాటన సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, వేసవి కాలం కావడంతో మంచినీటి వసతి, బసలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ప్రోటోకాల్‌, బందోబస్తుపై డీసీపీ నారాయణరెడ్డితో చర్చించారు. వైద్య శిబిరాలు, ఆర్టీసీ బస్సుల సౌకర్యం, నిరంతరం విద్యుత్‌ సరఫరా వాహనాల పార్కింగ్‌, తదితర సదుపాయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఉద్ఘాటన, సంప్రోక్షణబీ కార్యక్రమాలను అధికారులకు గీతారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం కార్యక్రమాల నిర్వహణ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అంచనా

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. ఉద్ఘాటన ఉత్సవాలు జరిగే సమయంలో రోజూ వేలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 75 మినీ బస్సులను కొండపైకి నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రోజూ తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ బస్సులు సేవలందిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!