ఇంతకు శ్రీశైలంలో ఏం జరిగింది
డీఎస్పీ రాకతో సద్దుమణిగిన లొల్లి
వదంతులునమ్మొద్దని డీఎస్పీ హితవు
శ్రీశైలం,మార్చి 31 (రోమింగ్ న్యూస్):
పవిత్ర పుణ్యక్షేత్రం నిత్యం భక్తిభావంతో నిండి ఉంటోంది. హరహర నామస్మరణ మార్మోగుతూ ఉంటోంది.

మనదేశంలోని భక్తజనంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా వచ్చే వేలాది మంది భక్తులు ఆ పరమ శివుని దర్శించుకుంటారు. అలాంటి పవిత్ర స్థలంలో బుధ, గురువారాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానికి కారణాలేంటి.. తెలుసుకుందాం..
చిన్నపాటి ఘర్షణ
ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని బుధవారమే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి వేళ ఓ భక్తుడు ఆలయ సమీపంలో టీ తాగేందుకు వెళ్లాడు. టీ కొట్టు యజమానిని మంచినీరు అడిగాడు. దానికి ఆ దుకాణ యజమాని లేవంటూ బదులిచ్చాడు. దీనిపై వారిద్దరి మధ్య వివాదం ముదిరింది. ఈ సమయంలో టీ కొట్టు యజమాని గొడ్డలితో ఆ భక్తుడిపై దాడికి దిగాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా బాధిత భక్తుడిని జగద్గురు పీఠాధిపతి పరామర్శించారు.
రణరంగం
భక్తుడిపై దాడి జరిగిందన్న సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు టీ దుకాణంతో పాటు పలు దుకాణాలను ధ్వంసం చేశారు. దుకాణాల్లో వస్తువులను చెల్లాచెదురు చేశారు. కనిపించిన వస్తువునెల్లా తగులబెట్టారు. కొన్ని వాహనాలకూ నిప్పుపెట్టారు. దీంతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. అక్కడ బీభత్స వాతావరణం నెలకొంది. రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.
పోలీసు పహారా
ఘటన వివరాలు తెలియడంతో పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఘర్షణను నివారించేందుకు బందోబస్తు చేపట్టి గొడవను అదుపులోకి తెచ్చారు. గురువారం కూడా పెద్ద ఎత్తున బలగాలను అక్కడికి రప్పించారు. ఏక్షణంలో ఏమి జరుగుతుందోనని పహారా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు.
ఈఓ లవన్న ఎక్కడున్నారు…?
ఇదంతా జరుగుతుండగా ఈ విషయాన్ని పోలీసులకు చేరవలసిన దేవస్థానం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి జరిగిన సంఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంత తతంగం జరుగుతుండగా 500 మంది పోలీసులు ఏం చేస్తున్నారని స్థానిక భక్తులు నిలదీస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారుల పరిస్థితి దీనంగా తయారైంది. ఉగాది బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తులకు విక్రయాలు చేసేందుకు… చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకున్నా వ్యాపారులు వడ్డీలు తీసుకువచ్చి ఏర్పాటు చేశారు. చివరికి దుకాణాలు ధ్వంసమై పోవడంతో వారు కంటనీరు పెడుతున్నారు. అప్పులు చేసి ఇ దుకాణాలు పెడుతుంది ఇప్పుడు మాకు దిక్కెవరని రోధిస్తున్నారు.