యాదాద్రి, ఏప్రిల్ 20 (రోమింగ్ న్యూస్) యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన అనుబంధ ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా మహోత్సవాలు బుధవారం సాంప్రదాయబద్దంగా ప్రారంభమయ్యాయి. విగ్నేశ్వర పూజ తో అర్చక బృందం ఉత్సవాలకు శ్రీకారం పలికారు.
శివాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మాణం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని యాదాద్రి పునర్నిర్మాణంలో కృతకృత్యులయ్యారు. యాదాద్రి కొండపైన శివకేశవులను దర్శించాలనే తలంపు ఉన్న భక్తులకు కొంగుబంగారంగా యాదాద్రిలో శివకేశవుల ఆలయాలను గతంలో నే నిర్మాణం చేశారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న మీదట ఆదిదేవుడు… పరమశివుని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలనుకునే భక్తుల కోసం కొండపైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వందల సంవత్సరాల నుంచి కొలువుదీరి ఉన్నది. అనేకసార్లు శివాలయ నిర్మాణాలను విస్తరిస్తూ పోయారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికయ్యాక ఏకంగా పాత శివాలయం మొత్తాన్ని శిథిలం చేసి సర్వాంగ సుందరంగా సరికొత్త ఆలయాన్ని మంటపంతో కలిపి నిర్మాణం చేయించారు.
దీనికి సంబంధించిన ఆలయ ఉద్ఘాటన వేడుకలు అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు తొగుట పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద స్వామి వారికి అప్పగించారు. ఆయన సూచనల మేరకు ఏప్రిల్ 20 నుంచి 25 వరకు ఉద్ఘాటన కార్యక్రమాలు మొదలయ్యాయి. 25న ఉదయం 10 గంటల ఇరవై ఐదు నిమిషాలకు మిధున లగ్నంలో స్పటిక లింగం ప్రతిష్టా మహోత్సవాన్ని పూర్తి చేస్తారు. యాదాద్రి దేవస్థానం అధికారులు శివాలయంలో పనిచేసే దేవస్థానం అర్చకులతో పాటు వరంగల్ భద్రకాళి దేవస్థానం ప్రధానార్చకులను కూడా ఆహ్వానించి ఉద్ఘాటన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
శివాలయం ప్రధానార్చకులు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో బుధవారం కైంకర్యాలు మొదలయ్యాయి. యాదాద్రి దేవస్థానం ప్రధాన అర్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు వేద పండితులు ఈ కార్యక్రమంలో మమేకమయ్యారు.
దేవస్థానం అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి దంపతులు కార్యనిర్వాహణాధికారి ఎన్. గీత, దేవస్థానం ఏఈవోలు గజవల్లి రమేష్ బాబు, దోర్బల భాస్కరశర్మ, గట్టు శ్రవణ్ కుమార్, వేముల రామ్మోహన్, జూశెట్టి కృష్ణ, ఆలయ పర్యవేక్షకులు ఏర్పాట్లలో పాల్గొన్నారు. ప్రతిష్ట ఉత్సవాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీ విఘ్నేశ్వర స్వామి పూజ, పుణ్యాహవాచనము, మాతృక పూజ, నాందీ ముఖం, పంచగవ్య ప్రాశన, రుత్విక్వరణం నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి 8:30 గంటల వరకు అంకురారోపణం ఉదకశాంతి రక్షోఘ్న హోమము నిర్వహించారు.